కోమటిరెడ్డిని కట్టడి చేసేందుకు....?

కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కట్టడి చేసేందుకు టీఆర్ఎస్ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తుంది. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆయన వరుస విజయాలతో దూసుకుపోతుండగా, టీఆర్ఎస్ మాత్రం ఈసారి ఆయన విజయయాత్రకు చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ అనేక వ్యూహాలను రచిస్తోంది. 1999 ఎన్నికల నుంచి వరుసగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరుస విజయాలను చవిచూస్తూనే ఉన్నారు. ఏ గాలి వీచినా.. ఏ సెంటిమెంట్ ఉన్నా కోమటిరెడ్డి విజయాలను మాత్రం ఇక్కడ ఆపలేకపోయాయి. అయితే ఈసారి ఎలాగైనా నల్లగొండ ను కైవసం చేసుకోవాలన్నది కేసీఆర్ వ్యూహం. అందుకే ఆజిల్లాపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వం పార్టీకి పెద్దగా ప్రయోజనం లేదని భావించిన కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తీసుకొచ్చారు. అలాగే మరికొందరు నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
తనకు ఎవరూ పోటీ కాదని అంటున్నా.....
ఈ నేపథ్యంలోనే కంచర్ల భూపాల్ రెడ్డి బ్రదర్స్ టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుందనిభావిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి మధ్యనే జరిగింది. కంచర్ల భూపాల్ రెడ్డికి టీడీపీ టిక్కెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 60,774 ఓట్లు రాగా స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డికి 50227 ఓట్లు మాత్రమే లభించాయి. కేవలం పదివేల ఓట్ల తేడా మాత్రమే ఉంది. అదీ ఏ పార్టీ మద్దతు లేకుండానే కంచర్ల అన్ని ఓట్లను సంపాదించుకున్నారు. దీంతో కేసీఆర్ ఎన్ని చికాకులున్నప్పటికీ కంచర్లను పార్టీలోకి తీసుకునేందుకు వెనుకాడలేదు. కేవలం కోమటిరెడ్డి టార్గెట్ గానే కంచర్లను పార్టీలోకి తీసుకొచ్చారు. వెంటనే ఆయనను నల్లగొండ ఇన్ ఛార్జిగా చేశారు. అయితే దీనిపై కోమటిరెడ్డి మాత్రం తనకు కంచర్ల ఏమాత్రం పోటీ కాదని బయటకు చెబుతున్నారు. తాను ఇరవై ఏళ్లుగా ఓటమి ఎరుగకుండా పనిచేస్తున్నానని చెప్పారు.తనపై గెలిచే శక్తి ఎవరికీ లేదంటున్నారు. కాని లోపల మాత్రం కోమటిరెడ్డికి కొంత భయంగానే ఉందని తెలుస్తోంది. నల్లగొండ నియోజకవర్గంలో మరికొన్ని చేరికలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

