కోదండరామ్ కొత్త దారి

తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ప్రభుత్వంపై మరింత వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నిధులు... నీళ్లు.... నియామకాలు కావడంతో ఆయన నిరుద్యోగుల సమస్యలపై గళమెత్తడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 31న టీజేఏసీ ఆధ్వర్యంలో కొలువులకై కొట్లాట బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్ మాట తప్పిందంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో విశిష్ట పాత్ర పోషించిన విద్యార్థులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తూతూ మంత్రంగా టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో కొలువుల కోసం కొట్లాట బహిరంగ సభకు ముందు కోదండరామ్ మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో ప్రొఫెసర్ కోదండరామ్, చుక్కారామయ్య, హరగోపాల్, భరత్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 31న కొలువులకై కొట్లాట.....
సమస్యలు ఉన్నంతవరకూ ఉద్యమాలు ఉంటాయని, ఉద్యమాలు అణిచివేయడం తగదని మేధావులు కేసీఆర్ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వంపై నిరంతరం వత్తిడి పెంచడమే పౌరసమాజం బాధ్యత అని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కాగా ఈ సభకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? అన్న సందేహం ఉంది. కోదండరామ్ నిర్వహించతలపెట్టిన ఆరో విడత అమరవీరుల స్ఫూర్తియాత్రను కూడా ప్రభుత్వం అడ్డుకుంది. కోదండరామ్ ను అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన కొలువులకై కొట్లాట బహిరంగ సభకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశం లేదు. కాని ఈ సభకు నిరుద్యోగులందరూ హాజరుకావాల్సిందిగా కోదండరామ్ నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సభను జరిపితీరుతామని కోదండరామ్ చెప్పారు. సోషల్ మీడియా ద్వారా ఈ సభపై విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తుంది టీజేఏసీ. ప్రభుత్వం అనుమతివ్వకుంటే న్యాయస్థానానికి వెళ్లి పర్మిషన్ తెచ్చుకోవాలని టీజేఏసీ భావిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- కోదండరామ్

