కోదండరామ్ ఇక డైరెక్ట్ ఫైట్

ప్రొఫెసర్ కోదండరామ్ డైరెక్ట్ ఫైట్ కు దిగుతున్నారు. ఇన్నాళ్లూ కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించిన కోదండరామ్ ఇక ప్రత్యక్ష కార్యాచారణకు దిగనున్నారు. ఈరోజు కొలువుల కొట్లాట సభకు కొట్లాడి మరీ అనుమతి తెచ్చుకున్నారు. హైకోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకున్న ప్రొఫెసర్ ఈ సభను జయప్రదం చేయాలని భావిస్తున్నారు. అందుకోసం అన్ని పార్టీల సహకారం తీసుకుంటున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల సహకారంతో కొలువుల కొట్లాట సభను విజయవంతం చేసి తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ కు హెచ్చరికలు పంపాలన్నది కోదండరామ్ ఆలోచనగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో యువతే ఎక్కువ పాత్ర పోషించారు. ముఖ్యంగా ఓయూ, కేయూ వంటి విద్యాసంస్థల నుంచే కాకుండా జిల్లాల్లోని అనేక కళాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమాన్ని చివరి దశకు తీసుకెళ్లారు. అందుకే ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కూడా అనేక మార్పులు రావాలన్నది కోదండరామ్ అభిప్రాయం. అందుకే నిరుద్యోగుల అంశాన్ని ప్రొఫెసర్ ఎంచుకున్నారు. ఈరోజు సరూర్ నగర్ స్టేడియంలో కొలువుల కొట్లాట సభ జరగనుంది. ఈ ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణంగా నామకరణం చేశారు. వేదికకు శ్రీకాంతాచారి పేరును పెట్టారు.
లెక్కలు ఫిక్స్ చేసిన ప్రొఫెసర్.....
కేవలం నిరుద్యోగులను, యువకులనే కాకుండా ఉద్యోగాలు రాకపోవడంతో నిరాశతో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను సయితం ఈ సభకు రప్పించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు కావస్తున్నా నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవ్వడమే తప్ప కొత్తగా ఉద్యోగాలిచ్చిందేమీ లేదంటున్నారు ఈ ప్రొఫెసర్. అంతేకాదు ఎంతమందికి ఇప్పటి వరకూ ఉద్యోగాలు ఇచ్చారో కూడా ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాచారం లేదంటున్నారాయన. తప్పుడు లెక్కలు చెబుతూ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుందంటున్న కోదండరామ్ నిరుద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామంటున్నారు. గతంలో ఉన్న ఖాళీలతో పాటు కొత్తగా ఏర్పడిన జిల్లాలతో మూడు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కోదండరామ్ లెక్కలు చెబుతున్నారు. కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్లను బతికించడం కోసమే తెలంగాణ విద్యార్థులను పట్టించుకోవడం లేదని ప్రొఫెసర్ ఆరోపిస్తున్నారు. అయితే ఈరోజు జరిగే సభకు విద్యార్థులు వెళ్లకుండా అధికార పార్టీ కూడా తన ప్రయత్నాలు తాను ప్రారంభించింది.
- Tags
- కోదండరామ్

