కోదండరామ్ అయిష్టంగానే...?

కోదండరామ్ కొత్త పార్టీ పెడతారా? జనవరిలోనే ఇందుకు ముహూర్తం నిర్ణయించారా? అవుననే అంటున్నాయి టీజేఏసీ వర్గాలు. కోదండరామ్ పై గతకొంతకాలంగా టీజేఏసీలో వత్తిడి వస్తుంది. కోదండరామ్ ను పార్టీ పెట్టాలని టీజేఏసీలోని అధిక మంది తీవ్రంగా వత్తిడి తెస్తున్నారు. అయితే కోదండరామ్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కోదండరామ్ రాజాకీయ పార్టీ పెట్టేకన్నా, ఉద్యమ వేదికను పెట్టాలని యోచిస్తున్నారు. ఉద్యమ వేదికను ఏర్పాటు చేస్తే అధికార టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకుని వెళ్లే వీలుంటుంది. అయితే ఉద్యమ వేదిక కన్నా రాజకీయపార్టీయే బెటరని ఎక్కువ మంది టీజేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో గెలుపోటముల కన్నా, రాజకీయ పార్టీ అయితే ప్రజాసమస్యలపై ఉద్యమించడానికి అవకాశముంటుందని, ప్రభుత్వ అనుమతి కూడా సులువుగా దొరుకుతుందని కోదండరామ్ కు టీజేఏసీ నేతలు నచ్చజెబుతున్నారు.
జనవరిలో కొత్త పార్టీ...?
ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీన తెలంగాణ న్యాయవాదుల జేఏసీతో కోదండరామ్ సమావేశమవుతున్నారు. రాజకీయ పార్టీపై వారితో చర్చించనున్నారు. రాజకీయ పార్టీ పెడితే కాంగ్రెస్, కమ్యునిస్టులతో కలిసి వెళ్లేందుకు వీలుంటుందని టీజేఏసీ నేతలు చెబుతున్నారు. అప్పుడు టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు చీలే అవకాశముండదని, అనుకున్న ప్రకారం అధికార పార్టీని ఓడించగలుగుతామని టీజేఏసీ నేతలు ఎక్కువ మంది కుండబద్దలు కొట్టేస్తున్నారు. అయితే ప్రొఫెసర్ మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయ పార్టీ అంటే ఆషామాషీ కాదని, క్షేత్రస్థాయిలో బలం లేకుండా రాజకీయ పార్టీ పెట్టి ఏం సాధిస్తామని కోదండరామ్ చెబుతున్నప్పటికీ టీజేఏసీ నేతలు వినడం లేదు. దీంతో జనవరిలో కోదండరామ్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన అందరితో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.
- Tags
- కోదండరామ్

