కోడి పందాలపై ఎంపీ జేసీ కామెంట్ అదిరిందిగా...!

అనతపురం ఎంపీ జేపీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడిన హాట్ హాట్‌గా ఉంటుంది. ఆయన ఎప్పుడు మీడియాకు చిక్కుతారా.. ఏం మాట్లాడించాలా? అని మీడియా ప్రతినిధులు సైతం వెయ్యికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. గత కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న జేసీ.. తాజాగా మంగళవారం ఆయన మీడియా ముందుకు వచ్చారు. విశాఖ రైల్వే జోన్ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏపీ ఎంపీలతో భేటీ అయింది. ఈ సందర్భంగా మీటింగ్ అనంతరం బయటకు వచ్చిన ఎంపీ.. తనదైన శైలిలో మీడియాతో ముచ్చడించారు.
కోసుకుంటే తప్పులేదు కాని....
ఏపీకి ఏం కావాలన్నా.. ప్రధాని మోడీ అనుగ్రహం ఉండాల్సిందేనని చెప్పుకొచ్చారు. పనిలోపనిగా మీడియా ప్రతినిధులు ఏపీలో కోడిపందాల విషయాన్ని కెలికారు. అంతే జేసీ రెచ్చిపోయారు. ''ఆ.. పోవయా.. ! కోళ్లు కోసుకుంటే తప్పులేదు కానీ, ఆడితే తప్పా?'' అన్నారు. ఇంతలో మరో మీడియా ప్రతినిధి.. ఈ విషయం మేం చెప్పడం లేదండీ.. హైకోర్టే సీరియస్‌గా ఉంది అన్నాడు. దీంతో మళ్లీ కల్పించుకున్న జేసీ.. ''అలానా.. అయితే, నేను చూసి సంతోషిస్తాలే!'' అన్నారు. దీంతో మీడియా ప్రతినిధి మళ్లీ కల్పించుకుని, గతంలో మీరు పశ్చిమగోదావరి వెళ్లారు కదా.. ఇప్పుడు కూడా వెళ్తారా అన్నాడు. దీనికి జేసీ.. ''ఆ.. వెళ్లక ఇంట్లో కూర్చుని ముసిరిపొమ్మంటావా ఏంటి? వెళ్తాను. కోళ్లు కొట్టుకుంటే కూడా చూడకూడదా?'' అని ముక్తాయించారు.
కోడిపందేలకు బరులు రెడీ....
మొత్తానికి జేసీ వ్యాఖ్యలతో మీడియా ప్రతినిధులు సహా సహచర ఎంపీలు అందరూ ఫక్కున నవ్వేశారు. మరోపక్క, హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పశ్చిమ గోదావరిలో తెరచాటుగా పందాల నిర్వహణకు ఏర్పాటు చకచకా సాగిపోతున్నాయి. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఖంగుతిన్న రెవెన్యూ అధికారులు, పోలీసులు జిల్లాలను జల్లెడ పడుతున్నారు. ఎక్కడెక్కడ పుంజులు కనిపించినా వెంటనే స్టేషన్లకు తరలిస్తున్నారు. మరోపక్క, కోడి పందాల నిర్వాహకులను సైతం అరెస్టు చేస్తున్నారు. అయితే, కోడిపందాల విషయంలో ఎంతో ఆరాటం చూపించే సినీ, రాజకీయ ప్రముఖులు మాత్రం సైలెంట్ తమ సిఫార్సులు తాము చేసేస్తున్నారు.
సుప్రీంకోర్టుకు....
తెర వెనుక ఉండి అభయం ఇచ్చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో పందాల ఏర్పాటుకు పనులు చకాచకా సాగిపోతున్నాయి. ఇక, కొందరు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. న్యాయవ్యవస్థలోని వెసులుబాట్లను తమకు అనుకూలంగా మలుచుకుని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో రెండేళ్ల కిందట పోలీసులు కోళ్లను స్వాధీనం చేసుకుని, పందాల నిర్వాహకులను అరెస్టు చేసిన సమయంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయని, ఈ కేసు విచారణ ఇప్పటికీ పూర్తి కాలేదని, సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న ఒక కేసుపై మరో పిటిషన్ స్వీకరించి విచారించే అర్హత లేదని కొత్త భాష్యంతో పిటిషన్ వేశారు. దీంతో సుప్రీం నుంచి తమకు అనుకూలం ఫలితం వస్తుందని ఆశిస్తూ.. ఏర్పాట్లలో తలమునలై ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

