కొత్త పాత్ర పోషించనున్న ఎన్టీఆర్ నిర్మిత భవనం

తాను ప్రభుత్వంలోకి రాగానే హైదరాబాదు నగరం నడిబొడ్డులో తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు నిర్మించిన చారిత్రాత్మక భవనం ఇప్పుడు తెలంగాణ కు సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరో చారిత్రాత్మక పాత్ర పోషించబోతున్నది. తెలంగాణ కు కొత్త సచివాలయం నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధపడుతూ ఉండడంతో.. హుసేన్ సాగర్ ఒడ్డున ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్ ఇప్పుడు తెలంగాణ కు తాత్కాలిక సచివాలయంగా, సీఎం కార్యాలయంగా సేవలు అందించబోతోంది.
తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మాణం కావడం అనేది ఖరారు అయింది. గతంలో దీనికోసం చాలా స్థలాల ఆలోచన చేసిన కేసీఆర్.. ఎట్టకేలకు ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే ఉన్నవి కూలగొట్టి కొత్తవి కట్టించడానికి నిర్ణయించడం తెలిసిందే. అయితే మూడు బ్లాకులుగా 8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో సువిశాలమైన సెక్రటేరియేట్ కట్టడానికి తొలుత కేసీఆర్ డిజైన్లు ఓకే చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్లాన్ల విషయంలో ఆలోచన కొద్దిగా మారినట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్తితుల్లోను వీలైనంత వేగంగా సెక్రటేరియేట్ ను పూర్తి చేయాలని అనుకుంటున్న కేసీఆర్ బిల్ట్ ఏరియాను తగ్గించాలని , 5 లక్షల చదరపు అడుగులు సరిపోతుందని అన్నట్లుగా తెలుస్తోంది. మూడు బ్లాకులు కాకుండా, ఒకే బ్లాకుగా నిర్మించి.. బహుళ అంతస్తులతో ఆకాశహర్మ్యం మాదిరిగా నిర్మించేలా కొత్త ప్లాన్ లు సిద్ధం చేయించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
మూడు బ్లాకుల సచివాలయానికి 350 కోట్లతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, బిల్టప్ ఏరియా 5 లక్షలకు కుదించి, బడ్జెట్ కూడా తగ్గేలా చూడాలని కేసీఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సచివాలయంలోని కార్యాలయాలను తరలించడానికి ఆరు భవనాలను గుర్తించారు. ముందే చెప్పుకున్నట్లు బూర్గుల రామకృష్ణారావు భవన్ పూర్తి స్థాయి సచివాలయంగా మారిపోతుంది. కొన్ని శాఖల కార్యాలయాలు వారికి సంబంధించిన ఇతర కార్యాలయాల్లోకి వెళ్తాయి. ఉదాహరణకు హోం శాఖ సచివాలయం డీజీపీ ఆఫీసు ప్రాంగణానికి వెళ్తుంది. నీటిపారుదల శాఖ వ్యవహారం జలసౌధకు చేరుతుంది. బూర్గుల భవన్ లో చివరి అంతస్తును సీఎం కార్యాలయంగా మారుస్తారు ఇలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

