కొత్త జిల్లాల సంఖ్య ఇంకా పెరిగేలా ఉంది

కేసీఆర్ అడిగిన వారికి లేదనకుండా ఇచ్చేయడం మొదలు పెట్టారు. ప్రారంభంలో పెరిగిన వాటితో కలిపి తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల సంఖ్య 27 అవుతుందని అనుకుంటే.. ఇప్పుడు పెరుగుతున్న జిల్లాల సంఖ్య 27 వరకు ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి. కేబినెట్ భేటీ తర్వాత సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించడం విశేషం.
జిల్లాల విషయంలో కేసీఆర్ మరీ ఉదారంగా వ్యవహరించారన్న మాటలు అప్పుడే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పినదాన్ని బట్టి.. అంతా అయిపోయిందని అనుకున్న తరువాత కూడా.. చివరి నిమిషంలోనూ.. ఎవరు నోరు తెరచి అడిగినా వారి సంతోషం కోసం ఒక జిల్లాను ఏర్పాటు చేసేలా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుంది.
అయితే కేవలం పెద్ద కమతాలను చిన్న కమతాలుగా మార్చేయడం ఒక్కటే సేద్యానికి సులువైన బాట వేస్తుందని అనుకుంటే భ్రమ. ఆ మాటకొస్తే పెద్ద కమతాల వల్ల ఉండే ఉపయోగం అలాగే ఉంటుంది. చిన్న కమతాల వల్ల జరిగే పనులు అలాగే జరుగుతాయి. జిల్లాలను చిన్నవిచేసేసినంత మాత్రాన ప్రజలందరి కష్టాలు తీరిపోతాయని ఎవరైనా అనుకుంటే అది కూడా భ్రమ. కేసీఆర్ కు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉండే అవినీతికి చెక్ పెట్టే కచ్చితమైన ప్రయత్నాలు చేయాలి. అధికారుల్ని జనానికి ఎంత దగ్గర్లో పెట్టామన్నది ముఖ్యం కాదు, వారిని ఎంత నిజాయితీగా పెట్టాం అన్నది ముఖ్యమని తెలుసుకోవాలి.

