కొణతాల భాజపా లో చేరబోతున్నారా?

సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తన కంటూ గుర్తింపు ఉన్న సెలబ్రిటీ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భారతీయ జనతా పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారా? సార్వత్రిక ఎన్నికల తర్వాత.. వైఎస్ జగన్ పోకడలతో విభేదించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటినుంచి మరో పార్టీ వైపు చూడకుండా ఇప్పటిదాకా స్వతంత్రంగానే ఉన్న కొణతాల రామకృష్ణ భాజపాలో చేరుతారనే ఊహాగానాలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. కాకపోతే మంగళవారం నాడు మధ్యాహ్నం భాజపాకు చెందిన రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ తో కొణతాల రామకృష్ణ భేటీ అవుతున్నారు. విజయవాడ లోని ఆయన నివాసంలో వెళ్లి కామినేని కలవబోతున్నారు. ఈ భేటీ నేపథ్యంలో కొణతాల భాజపాలో చేరుతారనే వార్తలు మళ్లీ ఊపందుకున్నాయి.
ఏపీలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి భాజపా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ అంతర్ధానం కావడం వల్ల ఏర్పడిన వాక్యూంను తాము భర్తీ చేయాలని వారు ఆరాటపడుతున్నారు. తెదేపాతో పొత్తులు ఉన్నప్పటికీ.. డిమాండు చేసి.. తమ సీట్ల సంఖ్యను పెంచుకునేంత బలం సంతరించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఎంతో అనుభవజ్ఞుడు సీనియర్ అయిన కొణతాల పార్టీలో చేరితే.. సమీకరణాలు మారుతాయని పలువురు అంచనా వేస్తున్నారు.

