కొంచెం నిప్పు, కొంచెం శాంతం : చినరాజప్ప లౌక్యం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు హోం మంత్రి చినరాజప్ప శనివారం సాయంత్రం ఓ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకర్ల సమావేశంలో ఆయన ప్రధానంగా ముద్రగడ పద్మనాభం మీద దృష్టి పెట్టారు. అలాగే భీమవరం ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో పవన్ కల్యాణ్ లేవనెత్తిన సందేహాలకు కూడా సమాధానం ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
జగన్ ప్లాన్ ప్రకారమే ముద్రగడ పాదయాత్ర చేస్తున్నారంటూ చినరాజప్ప విమర్శించారు. ముద్రగడను వైకాపా వెనుకనుంచి నడిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని,
ముద్రగడ మాటలు నమ్మి కాపు యువత మోసపోవద్దని ఆయన పిలుపు ఇచ్చారు. 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో లో ముద్రగడ కాపులకు ఏం చేశారు? అంటూ ప్రశ్నించిన చినరాజప్ప ముద్రగడ పద్మనాభం, జగన్ లు కలసి తుని తరహా విధ్వంసాలకు కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపణలు చేశారు.
సాధారణంగా తెలుగుదేశం నాయకులు ప్రెస్మీట్లు అంటే ప్రత్యర్థి జగన్ మీద ఏకధాటిగా విమర్శలతోనైనా లేకపోతే.. చంద్రబాబునాయుడు మీద ఏకధాటి పొగడ్తలతో అయినా సాగిపోవాలి. చిన రాజప్ప మాటలు శనివారం కాస్త డిఫరెంట్ సాగాయి. ముద్రగడ పద్మనాభం మరియు జగన్ లను ఒక జట్టుగా పరిగణిస్తూ.. ఇద్దరూ కలసి కాపు వర్గానికి ద్రోహం చేస్తున్నారనే ఆరోపణలు చేయడం వరకు దూకుడుగా ఉన్న చిన్నరాజప్ప.. భీమవరం ఆక్వాపార్కు విషయంలో పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలకు మెత్తగానే సమాధానం ఇచ్చారు. అంత చిన్న గ్రామంలో పోలీసులు 144 వ సెక్షన్ కొన్ని వారాలుగా అమలు చేస్తుండడమే ఘోరం అని విమర్శించడంతోపాటు, సామాన్యుల మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఆ కేసులన్నీ ఉపసంహరించాలని పవన్ కల్యాణ్ శనివారంసాయంత్రం ప్రెస్ మీట్ లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం అని మాత్రం చినరాజప్ప చెప్పారు.
అయితే నిర్దిష్టంగా ఆక్వాపార్కు పనులు ఆపేయడం గురించి గానీ, కనీసం 144 వ సెక్షన్ ఎత్తేయించడం గురించి గానీ.. ఈ హోంమంత్రి నిర్దిష్టమైన హామీ ఇవ్వకపోవడం విశేషం. ముద్రగడ , జగన్ అండ్ కో మీద ఒకవైపు నిప్పులు చెరుగుతూ.. పవన్ కల్యాణ్ మీద మాత్రం శాంతంగా స్పందిస్తూ చినరాజప్ప ద్వంద్వ ధోరణులను అవలంబించారంటూ రాజకీయ వర్గాల్లో అనుకుంటున్నారు.

