కేసీఆర్ స్పెషల్ అట్రాక్షన్

మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం పదిగంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈసారి బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో ప్రజారంజక బడ్జెట్ ను రూపొందించనుంది. అన్ని వర్గాల వారినీ సంతృప్తి పర్చే విధంగా బడ్జెట్ రూపుదిద్దుకుందని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. టీఆర్ఎస్ సర్కార్ కు ఇది ఐదో బడ్జెట్.
గవర్నర్ ప్రసంగంలో కేంద్రంపై.....
అయితే కేసీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారించడంతో గవర్నర్ ప్రసంగంలో కేంద్రప్రభుత్వాన్ని కూడా విమర్శించే ధోరణిలో కొనసాగుతుందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల విషయంలోనూ జాప్యం చేస్తుందని, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపర్చిన అంశాలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఇప్పటికే కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళతానని కేసీఆర్ ప్రకటన చేయడంతో ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానున్నారు.
దుమ్ము దులిపేయాలంటున్న కాంగ్రెస్.....
మరోవైపు కాంగ్రెస్ బస్సుయాత్రతో జిల్లాలను చుట్టి వచ్చిన జోష్ లో ఉంది. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టిన అంశాలను ఒక్కటి కూడా అమలు చేయలేదని, వీటిపై సభలో ఎండగడతామని కాంగ్రెస్ చెబుతోంది. దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, రైతులకు పెట్టుబడి మొత్తం విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. అయితే విపక్షానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార పార్టీ కూడా సిద్ధమయింది. వివిధ అంశాలపై మాట్లాడేందుకు ఇప్పటకే కేసీఆర్ కొందరిని ఎంపిక చేశారు. ప్రభుత్వ పథకాలను ఎలా అమలు చేస్తుందీ వీరు తెలియజేయనున్నారు. మొత్తం మీద నేటి నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.
- Tags
- కేసీఆర్
