కేసీఆర్ స్టయిలే వేరబ్బా ...!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పని చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. లక్ష్యం దిశగా ఆయన వేసే అడుగులు అందరికి స్ఫూర్తే. తాజాగా సాగునీటి ప్రాజెక్ట్ పనులపై దృష్టిపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా ఆ పనుల పూర్తికి సంకల్పించి కార్యాచరణ మొదలు పెట్టారు. తెలంగాణ గడ్డకు నీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేది లేదంటూ కేసీఆర్ పలు సభల్లో గతంలో ఛాలెంజ్ చేశారు. ఆ తరువాత మిషన్ భగీరథ పేరుతో జలయజ్ఞం పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు. అందులో అతి ముఖ్యమైనది కాళేశ్వరం.
అనుమతుల సమస్య లేదు ... నిధులకు కొరత లేదు ...
సంక్లిష్టమైన కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను దానికి అనుబంధంగా కట్టే కట్టడాలను రెండు రోజులపాటు సునిశితంగా పరిశీలించారు కేసీఆర్. అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. నత్తనడకన సాగుతున్న కొన్ని నిర్మాణాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తిరిగి చూసిన ప్రాజెక్టులపై హైదరాబాద్ ప్రగతిభవన్ వేదికగా అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఒక్క అటవీ అనుమతి తప్ప అన్ని అనుమతులు తెచ్చామని అది కూడా వచ్చేస్తుందని ఈలోగా డిజైన్లు ఇతర పనులను పూర్తి చేయాలన్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం కోసం 25 వేలకోట్ల రూపాయలను బడ్జెట్ లోనే కేటాయించామని , మరో 20 వేలకోట్ల రూపాయలు బ్యాంక్ రుణంగా సమకూర్చినందున నిధుల కొరత కూడా లేదని వేగవంతంగా పనులు చేయాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికలకు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి తమ ప్రభుత్వ పనితీరు చాటాలని గులాబీ బాస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
- Tags
- కేసీఆర్

