కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయను

దశాబ్దాల కల నెరవేరింది. రాదనుకున్న తెలంగాణ వచ్చింది. కొన్ని దశాబ్దాలుగా అన్ని రంగాల్లో వెనకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించడానికి ప్రవాస భారతీయులు సయితం తమ వంతు కృషి చేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడి... మన తెలంగాణ కోసం ఇక్కడకు వచ్చి ప్రజాసేవ చేయాలనుకునే వారు కొందరే ఉంటారు. డాలర్ల కోసం ప్రయాస పడకుండా డెవలెప్ మెంట్ కోసం ప్రయత్నించే అతి కొద్దిమందిలో మధు తాతా ఒకరు. ఖమ్మం జిల్లాకు చెందిన మధు తాతా ఇటీవల టీఆర్ఎస్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన సొంత టీంలో మధు తాతాకు చోటు దక్కింది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దరిదాపుల్లోకి కూడా ఉండదని, ఈసారి విజయం టీఆర్ఎస్ దేనని తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి మధు తాతా అభిప్రాయపడ్డారు. ఆయనకు ఇటీవల అట్లాంటాలో ప్రవాసభారతీయులు ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన ‘‘తెలుగు పోస్ట్’’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
తెలుగు పోస్ట్: తెలంగాణ స్టేట్ అభివృద్ధి పథంలో పయనిస్తుందంటారా?
మధు తాతా : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఎన్నో సమస్యలను అధిగమిస్తూ వస్తోంది. దశాబ్దాలుగా ఆదరణకు నోచుకోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. అనేక విషయాల్లో తెలంగాణను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవడం ఇందుకు ఉదాహరణ. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఆ లక్ష్యం ఎంతో దూరంలో లేదు. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరిందించేందుకు రంగం సిద్ధమయింది. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి కార్యక్రమాలతో స్వచ్ఛమైన నీరును తెలంగాణ ప్రజలకు అందించే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఫలించడానికి ఎంతో దూరం లేదు.
తెలుగు పోస్ట్: విపక్షం చేస్తున్న విమర్శల మాటేమిటి?
మధు తాతా: విపక్షం ఉన్నదే విమర్శలు చేయడానికన్నుట్లుంది. కాంగ్రెస్ అరవై ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతానికి ఏం చేసింది? తెలంగాణలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. అరవై ఏళ్లలో వారు చేయలేనిది.. కేసీఆర్ మూడున్నరేళ్లలో చేయగలరా? ఎవరికైనా సాధ్యమా? కాంగ్రెస్ నేతలు తమకు తాము ఆత్మవిమర్శచేసుకుంటే మంచిది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. బడుగు, బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడుతోంది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఉండకూడదనే కేసీఆర్ ఇటీవల చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు రెండు సీజన్లో పెట్టుబడి ఎనిమిది వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం సిద్ధమయింది. ఇక రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ఏర్పడితే విద్యుత్తు కొరత తీవ్రమవుతుందని ఎద్దేవా చేసిన వారు నోళ్లు వెళ్లబెట్టుకునేలా కేసీఆర్ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తును ఇచ్చారు. ఈ విషయాన్ని ఎవరైనా కాదనగలరా?
తెలుగు పోస్ట్: అవినీతి జరగడం లేదంటారా?
మధు తాతా: అవినీతిని అరికట్టడం ఒక్కరోజులో సాధ్యం కాదు. ఎవరి చేతా కాదు. మనం ఉన్న వ్యవస్థ అలాంటిది. అలాంటి వ్యవస్థను మార్చాలనే కేసీఆర్ ఇప్పటికే వివిధ చర్యలు చేపట్టారు. అన్నీ ఆన్ లైన్లోకి వచ్చేలా చూస్తున్నారు. ప్రస్తుతం భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుంది. అమెరికాలో ఒక ఇల్లు కొనుగోలు చేయాలంటే డాక్యుమెంట్లు గురించి బెంగ అవసరం లేదు. అంతా పక్కాగా ఉంటాయి. కాని ఇక్కడ ఇల్లు, స్థలం కొనాలంటే ఎన్నో విధాలుగా విచారించాల్సి ఉంటుంది. ఇకపై అలాంటిది తెలంగాణలో కూడా ఉండదు.ఇప్పటికే భూరికార్డుల ప్రక్షాళన 80 నుంచి 90 శాతం పూర్తయింది. కొద్దిరోజుల్లోనే తెలంగాణలోని ప్రతి అడుగు భూమి రికార్డుల్లో ఉంటుంది. మోసాలకు తావుండదు. అవినీతికి ఆస్కారం ఉండదు. మనం ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆవిధంగా మనల్ని మనం... మన ప్రాంతాన్ని మలచుకోవాల్సి ఉంటుంది.
తెలుగు పోస్ట్: సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్న దానిపై?
మధు తాతా : దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ప్రతి వర్గానికి న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష. ప్రతి సామాజిక వర్గం తమ కాళ్లపై తాము నిలబడాలన్నది ఆయన కోరిక. అందుకే యాదవులు, కురువలకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. దీనివల్ల వారు ఆర్థికంగా బలోపేతమవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది. ఇప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి రోజుకు 650 లారీల గొర్రెలను మాంసం కోసం దిగుమతి చేసుకుంటున్నాం. అలా కాకుండా మనమే ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అయ్యేలా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష. అలాగే కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, అందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి సదుద్దేశంతో రూపొందించిన ఈ పథకాలు క్షేత్రస్థాయిలో అక్కడక్కడా పక్కదోవ పట్టొచ్చు. కాని అది చాలా తక్కువ శాతం మాత్రమే. భూతద్దంలో చూసేవారికి అది పెద్దదిగానే కనపడుతుంది. కాని సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ అందుకుంటున్నారు.
తెలుగు పోస్ట్: అయితే పథకాలను విమర్శించకూడదంటారా?
మధు తాతా : విమర్శించవద్దని అనట్లేదు. సద్విమర్శలు చేస్తే దాన్ని పాజిటివ్ గా ఎవరైనా తీసుకుంటారు. కావాలని విమర్శలు పదే పదే చేస్తుండటమే తప్పు. ఇక్కడి వారికి కన్పించని అభివృద్ధి బయట వారికి ఎలా కన్పిస్తుంది. ఇక్కడ రైతుల ప్రయోజనాల కోసం తీసుకుంటున్న కార్యక్రమాలను చూసి స్వయంగా డాక్టర్ స్వామినాధన్ కేసీఆర్ సర్కార్ ను ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వానికి స్వామినాథన్ లేఖ రాశారు. అలాగే కర్ణాటక మంత్రి ఒకరు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోయారు. స్వయంగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ రైతులకు ఎనిమిదివేల పెట్టుబడి ఎలా ఇస్తారని ఆశ్చర్యపోయారు. సాధారణంగా ఉద్యమ నేతలు అభివృద్ధి చేయరన్న అభిప్రాయాన్ని కేసీఆర్ తొలగించారని సాక్షాత్తూ రాజ్ నాధ్ సింగ్ అన్నది నిజం కాదా? ఇంతకంటే ఏం కావాలి? ఇక్కడ విపక్షాలకు వేరే పనిలేదు. రంధ్రాన్వేషణ చేయడమే వారి పని. నిర్మాణాత్మక మైన విమర్శలు చేస్తే దాన్ని సానుకూలంగా స్వీకరిస్తాం.
తెలుగు పోస్ట్: ఎన్.ఆర్.ఐలకు మీరిచ్చే సలహా ఏంటి?
మధు తాతా: ప్రవాస భారతీయులు తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. అలాగే రాజకీయాల్లోకి కూడా రావాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. బంగారు తెలంగాణను సాధించాలంటే ప్రవాస భారతీయులు తలో చెయ్యి వెయ్యాల్సి ఉంటుంది. వారికి నేను అదే చెప్పాను. రాజకీయాల్లోకి రావచ్చు. లేదా తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చు. సేవాకార్యక్రమాలను నిర్వహించవచ్చు. తమ పుట్టిన గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఈ విధంగా ప్రయత్నాలు ప్రారంభించాం. టీఎస్ ఐపాస్ పెట్టారు. పెట్టుబడులకు హైదరాబాద్ లో ఎలాంటి ఢోకా ఉండదు. ప్రభుత్వం ఓపెన్ విండో పాలసీని పెట్టింది. దీనివల్ల అనుమతులు కూడా తొందరగా వస్తాయి. పరిశ్రమలకు 24 గంటలూ విద్యుత్తు సరఫరా అందిస్తున్నారు. అందుకోసమే ఎన్ఆర్ఐలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దేశంలోనే ఐటీ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. పరిశ్రమలకు మంచి అవకాశం ఇక్కడ ఉంది. సానుకూలమైన వాతావరణం ఉంది.
తెలుగు పోస్ట్: ముఖ్యమంత్రి సొంత టీం సభ్యుడయ్యారు కదా? మీ ఫీలింగ్?
మధు తాతా : నేను ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నామీద ఎంతో నమ్మకం పెట్టుకుని నాకు కార్యదర్శి పదవి అప్పగించారు. పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిగా నియమించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలను సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. గతంలో నేను పాలేరు ఎన్నికల ఇన్ ఛార్జిగా కూడా పనిచేశాను. పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపర్చడమే ముఖ్యం. ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల చెంతకు తీసుకెళ్లాలి. అందరినీ సమన్వయ పర్చుకుంటూ ముందుకెళ్లడమే మా పని.
తెలుగు పోస్ట్: అయితే వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తారా?
మధు తాతా: అది మన చేతిలో ఉండదు. ఎవరు పోటీ చేయాలో? ఎవరు పార్టీకి పనిచేయాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు. ఆయన అభిప్రాయం ప్రకారమే నడుచుకోవడం పార్టీ కార్యకర్తగా మా పని. నాకు అత్యున్నతమైన సెక్రటరీ పదవి ఇచ్చారు. భవిష్యత్ ఎలా ఉంటుందన్నది కేసీఆర్ చేతుల్లోనే ఉంది. గతంలో పాలేరు ఉప ఎన్నికల సమయంలో ఇన్ ఛార్జిగా ఉన్నాను. ఇటీవల సింగరేణి ఎన్నికలకు ఇల్లెందు బాధ్యతలు నాకు అప్పగించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడూ నేను చిత్తశుద్ధితో పనిచేశాను. అయితే పోటీ చేయాలా? వద్దా? అనే దానిని కేసీఆర్ నిర్ణయిస్తారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పజెప్పినా మనసా..వాచా.. చిత్తశుద్ధితో దాన్ని పూర్తి చేస్తా.. ధన్యవాదాలు.
- Tags
- మధుతాతా

