కేసీఆర్ తీరుతో వాళ్లందరూ ఫుల్ ఖుష్

‘‘ఈ పుట్టిన రోజును ఎప్పటికీ మరచిపోను... తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇక్కడే ఉన్నట్లుగా ఉంది. 29నెలలుగా రాష్ట్రం ఎంతో పురోగమిస్తోంది. మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తారనే విశ్వాసం ఉంది. ప్రజాప్రతినిధులు చాలా పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు తరలివచ్చారు. 70ఏళ్ల జీవితంలో ఇంత ఘనమైన పుట్టిన రోజును ఎన్నటికీ మరచిపోను’’ అంటూ గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన వేడుకల్లో తెలంగాణ నాయకులందరూ వచ్చి శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అయితే పుట్టినరోజు సందర్భంగా గవర్నరుకు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి తమ పార్టీకి చెందిన అందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా రాజ్‌భవన్‌కు కేసీఆర్ పిలిపించారు. అంతే కాదు ఆయన దగ్గరుండి, గవర్నరు పక్కనే నిల్చుని ఒక్కొక్క నాయకుడు వచ్చి పుష్పగుచ్ఛం అందిస్తోంటే.. ఆ నాయకుడు ఎవరు, పేరేమిటి, పదవి ఏమిటి గవర్నరుకు వివరించి చెబుతూ.. కేసీఆర్ పేరుపేరునా అందరినీ పరిచయం చేశారు. తమ పార్టీ అధినేత అంత శ్రద్ధగా గవర్నరుకు తమందరినీ పరిచయం చేయడంతో.. మొత్తం కార్యక్రమానికి హాజరైన నాయకులంతా ఫుల్ ఖుష్ అయిపోయారు.
కేసీఆర్ నాయకుడిగా ఎంతగా డౌన్ టూ ఎర్త్ ఉంటారో, అందరితో కలివిడిగా ఎలా ఉంటారో తెలుసుకోవడానికి ఇది కూడా మరొక ఉదాహరణ అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

