కేసీఆర్ చెప్పేశారు....!

ఇక నేను జాతీయ రాజకీయాల్లో కి వెళుతున్నాను. రాష్ట్ర పార్టీని మీరంతా జాగ్రత్తగా చూసుకోండి. అని చెప్పేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ఈ విషయం విస్పష్టంగా చెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో టిక్కెట్లు చాలావరకూ మార్చేస్తారని జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని వ్యాఖ్యానించి ఎమ్యెల్యేల్లో నెలకొన్న ఆందోళనలకు తెరదించారు. కేసీఆర్ తాజా వ్యాఖ్యలు టి ఆర్ ఎస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
ఆ ముగ్గురు ఎవరు... ?
పార్టీ అంతర్గత సమావేశాల్లో గులాబీ బాస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అందరు బాగానే ఉన్నారని కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా తమ పద్ధతి మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు టీఆరెస్ అధినేత. వారు ఎవరన్నది ఆయన చెప్పకపోవడంతో నేతల్లో గుబులు బయల్దేరింది. వారికి ఇంకా సమయం ఇస్తున్నాను అని తీరు మార్చుకోకపోతే ఆ ముగ్గుర్ని మార్చేస్తా అన్నారు కేసీఆర్. తెలుగు రాని వారితో కూడా సర్వే చేయించామని 2019 ఎన్నికల్లో 106 స్థానాల్లో గెలవబోతున్నట్లు ప్రకటించారు ఆయన.
కేటీఆర్ కి రాష్ట్ర పార్టీ పగ్గాలు...
ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ కి రాష్ట్ర పార్టీ భాధ్యత లు అప్పగింపు అంశాన్ని మాత్రం గులాబీ పార్టీ అధినేత తేల్చలేదు.అయితే ఇప్పటికే తన సమర్థతను చాటుకున్న కుటుంబ వారసుడికే కీరీట ధారణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు టిఆర్ఎస్ వర్గాల సమాచారం. మేనల్లుడు హరీష్ రావు, కవిత కేసీఆర్ తదనంతరం వారసత్వాన్ని కోరుకుంటున్నా కొడుకు చేతికి పగ్గాలు ఇచ్చేయాలని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారని టాక్ జోరుగా వినిపిస్తుంది.మరి కేసీఆర్ అధికారిక ప్రకటన వెలువడటమే ఆలస్యం అంటున్నారు. తాను వుండగానే కొడుకు కుమార్తె , అల్లుడికి వారి వారి పాత్రలు అప్పగిస్తారని గులాబీ వార్గాల అభిప్రాయం. దానికి కేసీఆర్ ముహూర్తం ఎప్పుడుపెడతారో వేచి చూడాలి.
- Tags
- కేసీఆర్
