కేసీఆర్ కు..ఆ ...ఆరుకు..ఏంటి సంబంధం?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్లను ఎక్కువగా నమ్ముతారు. ఆయన తెలంగాణ ఉద్యమం నాటి నుంచే సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటారు. ఆయనకు నమ్మకాలు ఎక్కువ. దాని కోసం ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు అనుకోరు. అలాగే వాస్తును కూడా గట్టిగా నమ్ముతారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఆయన తన నమ్మకాలను మాత్రం వదులుకోరు. తాజాగా రైతు సమన్వయ సమతి సభ్యుల సంఖ్యతో కూడా ఆయన సంఖ్యాశాస్త్రాన్ని ఎంత బలంగా నమ్ముతారో ఇట్టే అర్థమవుతుంది. ఎవరు కాదన్నా...ఎవరు అవునన్నా...గులాబీ బాస్ మాత్రం తాను అనుకున్న దారిలోనే వెళతారు.
నమ్మకాలు ఎక్కువే.....
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మకాలు, సంఖ్యాశాస్త్రం, వాస్తుపై ఎక్కువ మక్కువ. ఇది అనేక విషయాల్లో బయటపడింది. ప్రత్యర్థులు మూఢనమ్మకాలని కొట్టిపారేసినా ఆయన పట్టించుకోరు. సీఎం కేసీఆర్ కు ఆరు అంకె అంటే ఎంతో ఇష్టం. ఆయన ఏర్పాటు చేయబోతున్న రైతు సమన్వయ సమితుల విషయంలో కూడా సంఖ్యాశాస్త్రాన్ని పాటించారు. ఆరు అంకె కలిసి వస్తుందని భావించిన కేసీఆర్ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అందులో సభ్యులను ఆరు అంకెకు మాత్రమే పరిమితం చేయడం విశేషం. ఆరు అంకెకు అంత ప్రాధాన్యత ఇస్తారని దీన్ని బట్టే అర్థమయింది.
ఆరు అంకెతోనే... అంతా.....
ఇక కేసీఆర్ వినియోగించే వాహనాలన్ని కూడా ఆరు అంకెతోనే ఉంటాయి. వాహనాల నెంబర్లు ఆరు అంకె కాకుండా వేరే సంఖ్యను కేసీఆర్ ఇప్పటి వరకూ వినియోగించలేదు. అలాగే కేసీఆర్ చివర జీరోను అశుభంగా భావిస్తారు. అందుకే షాదీముబారక్, కల్యాణ్ లక్ష్మి పథకాలకు తొలుత 75,000 ప్రకటించిన కేసీఆర్ తర్వాత దానిని 75,116గా మార్చారు. అలా కేసీఆర్ సంఖ్యాశాస్త్రాన్ని బలంగా నమ్ముతుంటారు. ఇక వాస్తు విషయాన్ని కేసీఆర్ చాలా సీరియస్ గా తీసుకుంటారు. తెలంగాణ సచివాలయంలో వాస్తు బాగాలేదని ఆయన ప్రగతి భవన్ నుంచే పరిపాలన నడుపుతుండటం విశేషం. ఎవరేమనుకున్నా సరే....తాను అనుకున్నది చేస్తుంటారు కేసీఆర్. వాస్తవానికి రైతు సమన్వయ సమితుల్లోనూ ఎంతమందినైనా నియమించుకునే వీలుంది. కాని కేసీఆర్ మాత్రం ఆరుకే పరిమితం చేయడంతో మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ చర్చనీయాంశమైంది.
- Tags
- కేసీఆర్

