కేసీఆర్‌ను ఆ తుఫాన్ ముంచేస్తుందా... బీ అలెర్ట్..!

అంత పెద్ద ఏనుగు కూడా చిన్న అంకుశానికి భయపడినట్టు.. రాజకీయ మేధావిగా పేరుతెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర సారధి, టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పుడు 'ఇసుక' అనే చిన్న విషయానికి ఒణికిపోతున్నారనే వార్తలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో చెలరేగుతున్న ఇసుక మాఫియా ఆయనను, ఆయన పార్టీని బజారు పాలు చేస్తోంది. వానపాములు అని ఆయన తరచుగా తిట్టిపోసే విపక్షాలు ఈ ఇసుక అంశాన్ని అందిపుచ్చుకుని తాచు పాముల్లాగా అధికార పక్షంపై బుసలు కొడుతున్నాయి. దీంతో ఇప్పుడు సీఎం చంద్రశేఖర్‌రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో పరిస్థితి ఇలా తుఫాన్‌ను తలపిస్తుండడంతో ఏం చేయాలో తెలియక ఊపిరాడక నానా తిప్పలు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఇసుక గండంలో సొంత పార్టీ నేతల హస్తం ఉండడం మరిన్ని చిక్కులు తెస్తోంది.
ఇసుకాసురుల దెబ్బకు....
విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించిన రీచుల్లోనూ యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. దీనికి అడ్డు చెప్పిన వారిని చితకబాదుతున్నారు. ఈ చిన్నపాటి ఘర్షణలే రాను రాను పెద్దవిగా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. అయితే, వీటిని ఆదిలోనే అంతం చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే విమర్శలతో విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు చేస్తున్నాయి. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం పరిధిలోని నేరెళ్లలో ఇసుక మాఫియా ఘాతుకానికి ఎందరో అల్లాడి పోతున్నారు. సాయంత్రం ఏడుగంటల నుంచి తెల్లవార్లూ లారీలతో ఇసుకను తరిలించేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఇసుక క్వారీపై నిషేధం ఉంది. అయినా కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
దళిత యువకులను....
దీంతో ఆగ్రహించిన స్థానికులు దాదాపు పది నెలల కిందట ఓ ఇసుక లారీకి నిప్పుపెట్టారు. అయితే, ఈ లారీ అధికార పార్టీ నేతకు చెందినది కావడంతో పోలీసులు అతిగా ప్రవర్తించారు. లారీకి నిప్పుపెట్టిన వారనే ముద్రవేసి స్థానిక యువకలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ విషయం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. హైకోర్టు పోలీసులను తీవ్రస్థాయిలో మందిలించింది. ఇక, ఆ తర్వాత కొంతకాలం ఇసుక మాఫియా సైలెంట్‌గా ఉన్నా.. మళ్లీ రెచ్చిపోతోంది. ఇటీవల మళ్లీ ఇసుక లారీల హల్చల్ పెరిగిపోయింది. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కాంభాపూర్ సాయిలు హత్య కలకలం రేపింది. ఇసుక లారీలను అడ్డుకున్న నేరానికి సాయిలును హత్య చేసినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కోదండరామ్ కూడా....
దీనిపై పూర్తిస్థాయిలో విచారించాల్సిన ప్రభుత్వం అలా చేయకుండా సాయిలు అసలు వీఆర్ఏ కానేకాదని, అతనికి కాంభాపూర్‌తో సంబంధం లేదని మంత్రి కేటీఆర్ చెప్పేశారు. దీంతో ఈ వివాదం మరింతగా రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టింది. సాయిలు వీఆర్ఏ కాకున్నా.. ఒక సామాన్య పౌరుడిగా ఇసుక మాఫియాను అడ్డుకుంటే ప్రాణాలు తీస్తారా అన్న ప్రశ్నలతో విపక్షాలు అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో ఇసుక మాఫియాను అరికట్టే విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలూ పెద్ద ఎత్తున విమర్శలకు దిగడంతోపాటు వామపక్ష నేతలు, టీ.జేఏసీ చైర్మన్ కోదండరాం సిద్దిపేట నుంచి సిరిసిల్ల దాకా పాదయాత్ర చేపట్టారు. దీంతో ఈ పరిణామం అటు తిరిగి, ఇటు తిరిగి కేసీఆర్ ను ఇబ్బంది పెట్టడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఇసుక తుఫాను తమకు గండంగా పరిణమించక తప్పదని గులాబీ బాస్ అనుకుంటున్నారు. మరి దీనికి విరుగుడుగా ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
- Tags
- కేసీఆర్

