కేవలం దర్శకుడి పేరు నిలబెడుతుందా?

మోహన్ లాల్, మమ్ముట్టి వంటి మలయాళం నటులు అధిక సంఖ్యలో తెలుగు చిత్రాలు చేయనప్పటికీ కొద్దో గొప్పో మలయాళం నటులను మన ప్రేక్షకులు గుర్తు పడతారు కానీ కన్నడ నటుల ముఖాలు మన వాళ్లకి పరిచయం తక్కువ. ఉపేంద్ర లాంటి నటులు మాత్రమే విజయాపజయాలకు అతీతంగా తెలుగులోనూ చిత్రాలను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు అనువాద చిత్రాలు మన మార్కెట్ పై ఎక్కువ ప్రభావం చూపుతున్న తరుణంలో పరిచయ నటుడు నిఖిల్ జాగ్వార్ చిత్రం తెలుగు లోనూ విడుదల చేసారు. రచయిత విజయేంద్ర ప్రసాద్, తమన్నా వంటి పేర్లు ఇక్కడ ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి కానీ ఫలితం మాత్రం నిరాశ పరిచింది.
ఈరోజు విడుదల ఐన నాగ భరణం చిత్రంలోనూ అధికంగా కన్నడ నటులే వున్నారు. కానీ దర్శకుడు కోడి రామ కృష్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు కావటంతో తెలుగులోనూ బాగా ప్రచారం చేసి విడుదల చేసారు. మరి కోడి రామ కృష్ణ క్రేజ్ మరియు సినిమాలోని గ్రాఫిక్ వర్క్స్ ప్రేక్షకులను థియేటర్లవరకు రప్పిస్తాయో లేక ఇటీవల విడుదల ఐన జాగ్వార్ చిత్రం వలెనే తెరపై కనిపించే నటులు ఎవరూ పరిచయం లేక ప్రేక్షకుల ఆదరణకు దూరం అవుతుందో చూడాలి.
నాగ భరణం చిత్రంలో దివంగత నటుడు విష్ణు వర్ధన్ ని గ్రాఫిక్స్‌లో సృష్టించారు దర్శకుడు కోడి రామ కృష్ణ. విష్ణు వర్ధన్ గ్రాఫిక్స్ చిత్రం పతాక సన్నివేశాలలో కనిపిస్తాయి.

