కేటీఆర్ గారూ... ఈ స్మార్ట్ స్కామ్ ఏంటి సారూ....!

మొన్న కాల్వల తవ్వకాల్లో అక్రమాలు..... తాజాగా చెత్త తరలింపు వాహనాల రిపేర్ల స్కామ్ ..ఏకంగా జీహెచ్ఎంసీ లో 23 కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది. వాహనాల రిపేర్ల పేర్లతో దొంగ బిల్లులు పెట్టి కొట్టేసిన ఘనులను ఇప్పడు సీసీఎస్ వెంటాడి వెంటాడి పట్టుకుంటున్నారు.
ఇది భారీ స్కామ్.....
గ్రేటర్ మున్సిపాలిటిలో భారీ స్కామ్ వెలుగుూసింది. స్కామ్ చేసిన వారిని ఈ సారి వదిలి పెట్టలేదు...మొన్నటికి మొన్న కాల్వల తవ్వకాల్లో భారీ అక్రమాలు చేసిన అధికారుల చేతి వాటం మరిచి పోక ముందే ఇప్పడు మరో స్కామ్ బయట పడింది. ఈ సారి ఏకంగా 23 కోట్ల రూపాయల భారీ అవినీతి జరిగింది. ఈ అవినీతిలో కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల హస్తం వున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ స్కామ్ లో దిమ్మ దిరిగే విషయాలు వెలుగు చూశాయి. ప్రధానంగా ఈ స్కామ్ కు సూత్రధారులు. పాత్రధారులందరు ఉన్నత స్దాయి అధికారులన్న విషయం విచారణ లో వెలుగు చూసింది..
మరమ్మత్తుల పేరిట 23 కోట్లు....
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో కొన్నాళ్ల క్రితం భారీగా వాహనాలు కొనుగోలు చేశారు. ఈ వాహనాలు రోడ్డు ఎక్కిన తర్వాత 24 నెలల వరకూ ఏ మరమ్మత్తులు వచ్చినా అన్నీ కంపెనీయే భరిస్తుంది. మొత్తం ఆరువందల వరకూ చెత్త తరలించే వాహనాలను జీహెచ్ఎంసీ కొనుగోలు చేసింది. ఈ వాహనాలకు రెండు సంవత్సరాల వరకూ కంపెనీ గ్యారంటీ ఉంటుంది. రెండేళ్ల వరకూ వాహనాలకు ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. అయినా కూడా జీహెచ్ఎంసీలోని ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులు మరమ్మత్తులు పేరిట 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
తప్పుడు బిల్లులు పెట్టి....
తప్పుడు పత్రాలను సృష్టించడం, లేని కంపెనీ పేర్లమీద వాహనాల విడిభాగాలను కొనుగోలు చేసినట్లుగా బిల్లులు పెట్టారు. అయితే ఈ బిల్లులను తనిఖీ చేయాల్సిన జీహెచ్ఎంసీ ట్రెజరీ విభాగం ఎలాంటి చెకింగ్ లేకుండా బిల్లులను పాస్ చేయడం గమనార్హం. దీంతో అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. దాదాపు 23 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఉన్నతాధికారుల విచారణలో వెల్లడయింది. కుంభకోణానికి పాల్పడిన అధికారులపై కేసు నమోదు చేయాల్సిందిగా స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
నలుగురి అరెస్ట్...20 మందిపై కేసు.....
ఈ కుంభకోణంలో డీఈఈ స్థాయి అధికారి నుంచి కిందిస్థాయి అధికారుల పాత్ర ఉన్నట్లు విచారణలో గుర్తించారు. కొన్ని ఆటోమొబైల్ షాపుల పేర్ల మీద నకిలీ బిల్లులను సృష్టించిన విషయం కూడా బయటపడింది. కొత్త వాహనాలను కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత రిపేర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఒక్కొక్క వాహనానికి మూడు నుంచి ఆరుసార్లు మరమ్మత్తులు చేసినట్లు బిల్లులు పెట్టారు. కొన్ని వాహనాలను షెడ్ నుంచి బయటకు తీయకపోయినా వాటికి రిపేర్లు చేశామని బిల్లులు పెట్టారు. ఇందులో నలుగురు కీలక పాత్ర పోషించినట్లు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడయింది. దీంతో డీఈఈ రామ్ చందర్ తో పాటు మరో ముగ్గురు సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా ఇరవై మంది సిబ్బందిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. కేటీఆర్ గారూ.. ఈ చెత్త స్కామ్ ఏంటి సారూ....!

