కేఈ...మాటల్లో అంతరార్ధం ఏంటి?

ఇలాంటి పార్టీ అసెంబ్లీలో ఉండటం , ఇలాంటి నాయకుడు ప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీకి దౌర్భాగ్యం అంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్యెల్యేలు వైసిపి అధినేతపై విమర్శల దాడి చేసేవారు . ఇప్పుడు వారు రూటు మార్చారు. జగన్ విపక్ష నేత కావడం అదృష్టం అంటున్నారు. ఎందుకీ తేడా వచ్చిందో..? సాక్షాత్తు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కెఇ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశం అయ్యాయి.
కెఇ ఎందుకన్నారు ..?
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి మీడియా తో మాట్లాడారు. వైసిపి అధినేత జగన్ త్వరలో చేపడుతున్న పాదయాత్రను మంత్రి ప్రస్తావించారు. రాజుగారి కుమారుడు రాజు అవ్వొచ్చు కానీ ముఖ్యమంత్రి కుమారుడు ముఖ్యమంత్రి కాలేడు అంటూ స్పందించారు కృష్ణ మూర్తి. పాదయాత్రతో జగన్ సీఎం కావాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు.
కెఇ వ్యాఖ్యలు లోకేష్ కి వర్తించవా ..?
ఏపీ ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణ మూర్తి వ్యాఖ్యలు ఒక పక్క జగన్ మరోపక్క నారా లోకేష్ ను ఉద్దేశించి చేసినావా అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇటీవల కొంత కాలంగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో తేడా వచ్చి కృష్ణ మూర్తి అసంతృప్తిగా ఉన్నారనే టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా అనే పరిస్థితి ఎదురౌతుంది . ప్రస్తుత సీఎం చంద్రబాబు కి ఏకైక రాజకీయ వారసుడు నారా లోకేష్ . తాను ముఖ్యమంత్రిగా ఉండగానే లోకేష్ ను ఎమ్యెల్సీని చేసి మంత్రిని చేశారు చంద్రబాబు . ఇక నారా కుటుంబంలో మూడో వారసుడు దేవాన్ష్ ను కూడా ఐదేళ్లు నిండ కుండానే సభలు సమావేశాలకు బాబు తనవెంట తిప్పుతూ లోకేష్ తరువాత తరాన్ని పార్టీకి ముందుచూపుతో పరిచయం చేసేస్తున్నారు. ఈ దశలో కెఇ చేసిన వ్యాఖ్యలు ఒక్క జగన్ కేనా లేక లోకేష్ తో కలిపి చేశారో ఆయన అంతరంగానికే తెలియాలి .

