కృష్ణా పోరుబాటను కేబినెట్ తేలుస్తుందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ, శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న కేబినెట్ సమావేశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మీద పోరాటపంథాను నిగ్గు తేల్చనుంది. ఇప్పటికే ఈ తీర్పు మీద తెలంగాణ యావత్తూ వ్యతిరేకత రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కార్యచరణను తేల్చడానికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు.
తెలంగాణ కేబినెట్ శుక్రవారం మధ్యాహ్నం సమావేశం కానుంది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ప్రధానంగా చర్చించనుంది మంత్రివర్గం. ఈ తీర్పును నిలుపదల చేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలా...? వద్దా..? అనే విషయమై మంత్రిమండలి భేటీలోనే నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. దీంతో పాటుకొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి కూడా చర్చించనుంది కేబినెట్.
ఆరు దశాబ్దాలుగా తెలంగాణకు కృష్ణా జలాల పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందనీ,... వాటిని సవరించి మళ్లీ నాలుగు రాష్ట్రాల మధ్య నీటిని పున పంపిణీ కేసీఆర్ సర్కారు అటు కేంద్రం, ఇటు ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపిస్తూనే ఉంది. అయినప్పటికీ తమ వాదనను కేంద్రప్రభుత్వం కానీ, ట్రిబ్యునల్ కానీ పట్టించుకోలేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను హరించే విధంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు, అడిషనల్ ఏజీ లతో ఫోన్ లో మాట్లాడారు. మరోవైపు సుప్రీం కోర్టును ఆశ్రయించే విషయమై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానంలో కృష్ణా జలాలకు సంబంధించి కేసు పెండింగ్ లో ఉంది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డుల్లో తెలంగాణకు నీటి పంపకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందంటూ కేసీఆర్ గవర్నమెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ప్రస్తుతం అది సుప్రీం పరిధిలోనే ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల పంపిణీ కేవలం ఉమ్మడి రాష్ట్రానికే..అంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్యేే ఉంటుందంటూ మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును నిలుపదల చేయాలంటూ సుప్రీం ను ఆశ్రయించాలా వద్దా అనేది ప్రధానంగా కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.
అలాగే సీఎం కేసీఆర్ కలలు కంటోన్న నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించి మంత్రిమండలి సమావేశంలో చర్చ జరగనుంది. ప్రస్తుత సచివాలయంలోని ఏబీసీడీ బ్లాకులను ఏ టైంలోగా కూల్చి.. అక్కడ ఏ రకమైన ఆకారంలో...ఎంత విశాలంగా కొత్త సెక్రటేరియట్ ను కట్టాలి అనే విషయమై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుత ఏపీ సచివాలయంలోని బ్లాకులను అప్పగించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన విన్నపాన్ని కేసీఆర్ సర్కారు తెలియజేసింది. ఏపీ నుంచి అనుమతి లభించగానే..అక్కడి బ్లాకులన్నింటినీ కూల్చేసి...ఆ ప్రాంతాన్ని కూడా కొత్తగా నిర్మించనున్న సచివాలయం పార్కింగ్ కు, గార్డెన్లు, జిమ్ లకు వినియోగించుకునేలా ఇప్పటికే సర్కారు ప్లాన్ చేసింది. వీటన్నిటిపై కేబినెట్ చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది.

