కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై కత్తులు నూరుతున్నారు!

జలాల పంపకం విషయమై రెండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అంటూ కృష్ణా ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు పట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజలు నాయకులు సంతృప్తిగా లేరు. ఈ నిర్ణయం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు చేటు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు పెరగడానికి ఈ తీర్పు దోహదం చేయడం తప్ప.. జలాల విషయంలో తెలుగువారికి న్యాయం చేసేలా లేదని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తీర్పు వెలువడిన సమయంలోనే.. అది చాలా అసంతృప్తి కరంగా ఉన్నదంటూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ అన్నారు.
అయితే వాస్తవానికి కృష్ణా జలాల పంపిణీ విషయంలో జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రైబ్యునల్ తాజా తీర్పు ను విభజన చట్టం సెక్షన్ 89 కే పరిమితం చేయడంలో కుట్ర దాగి ఉన్నదని నాయకులు భావిస్తున్నారు. దీని ద్వారా చేటు జరగక ముందే ప్రభుత్వాలు మేలుకోవాలని కోరుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్ర నీటి కేటాయింపులకే పంపిణీని పరిమితం చేయాలనడం వివాదాలను మరింత జఠిలం చేస్తుందనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి.
ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల గొంతుకోసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, జలాల పునర్ పంపిణీని ఉమ్మడి రాష్ట్ర నీటి కేటాయింపులకు పరిమితం చేయాలని కేంద్రం ట్రైబ్యునల్ కు నోట్ సమర్పించడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఆంధ్రపదేశ్ లోని కృష్ణా డెల్టా పరిరక్షణ సమితి నాయకుడు కొలనుకొండ శివాజీ ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలు కృష్ణా నదిపై అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల విషయంలో నోరు మెదపకుండా ట్రిబ్యునల్ ను రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేయాలనే ఆలోచనే కుట్రతో కూడుకున్నదని పలువురు అంటున్నారు. మోదీ సర్కారుకు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నాలుగు రాష్ట్రాలకు సమన్యాయం జరిగేలా ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పునర్ పంపిణీ చేసే ప్రాతిపదికన కొత్త ట్రైబ్యునల్ ను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నీటి లభ్యత లేనప్పుడు ఆపరేషన్ ప్రోటోకాల్ అన్ని రాష్ట్రాలకు వర్తింప చేయాలని కూడా అడుగుతున్నారు.
అయితే దక్షిణాది రాష్ట్రాలంటేనే చిన్నచూపు ఉండే మోదీ సర్కారు వీరి డిమాండ్ల పట్ల ఎలా స్పందిస్తుందో చూడాలి.

