కిం కర్తవ్యం : టీ కాంగ్రెస్ కన్ఫ్యూజన్లో ఉందా?

జిల్లాల వ్యవహారం అయిపోయింది. జిల్లాల ఏర్పాటు విషయంలో.. తెరాస ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నదనే.. ఆరోపణను ప్రజలు పెద్దగా ఆమోదించకుండానే అది పాతబడిపోయింది. కొత్తజిల్లాలు కొలువుదీరాయి. ఇప్పుడు ఏం చేయాలి? తెరాస ప్రభుత్వం సాగిస్తున్న దూకుడైన పాలనకు దీటుగా రాబోయే రెండున్నరేళ్లపాటూ పార్టీని కాపాడుకోవడం ఎలాగ? స్తబ్దుగా ఉంటే పార్టీ పూర్తిగా మరుగున పడిపోతుంది. ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ ఉంటే తప్ప అటు ప్రజల్లో మనుగడ కష్టం. ఇటు పార్టీలో కార్యకర్తలను, శ్రేణులను కాపాడుకోవడం కష్టం అనే అభిప్రాయంతో టీ కాంగ్రెస్ సతమతం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం సమావేశం అవుతున్నారు. తాము చేపట్టవలసిన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ గురించి చర్చించుకోవడానికి వారు ఎజెండాగా పెట్టుకున్నారు.
అయితే టీ కాంగ్రెస్లో చాలా సహజంగా తెరాస ప్రభుత్వం మీద పోరాటం సాగించే విషయంలో ఏకాభిప్రాయం లేదని, గందరగోళంలో ఉన్నారని అర్థమవుతూనే ఉంది. జిల్లాలు ఏర్పడిన మరురోజు కూడా ఇలాంటి సమావేశమే జరిగింది. జిల్లాల్లో రాష్ట్రస్థాయి నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని తీర్మానించారు. ఆ తీర్మానానికి అతీగతీ లేదు. ఇప్పుడు మళ్లీ మరో సమావేశం అంటున్నారు. అచ్చంగా తెలుగుదేశ పార్టీ రెండు రోజుల కిందట ధర్నా నిర్వహించిన తరహాలోనే.. రైతుల సమస్యలను ఎజెండాగా తీసుకోవాలనుకుంటున్నారు. పంటరుణాలు, నకిలీవిత్తనాల మీద పోరాటం అనుకుంటున్నారు. ఇంకా ఫీజు రీ ఇంబర్స్మెంట్ విషయంలో పోరాడాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర నాయకులు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వ్యవహరించే వారు కావడంతో.. తెకాంగ్రెస్ పోరాటాలు గాడి తప్పుతున్నాయనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది.

