కాలుష్యంలో కూడా రాజకీయమా?

ఢిల్లీ వాయు కాలుష్యం రాజకీయ వేడిని సృష్టిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో పెరుగుతున్న వాయుకాలుష్యంపై హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ఢిల్లీలో వాయుకాలుష్యం ఇటీవల పెరిగిపోతోంది. పొగమంచు కారణంగా వాయుకాలుష్యం మరింత ఎక్కువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు మాస్క్ లు లేకుండా బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది. పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. దట్టమైన పొగమంచుకారణంగా రైళ్లు, విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ కి దగ్గరలోని హైవేలో అనేక ప్రమాదాలు జరగుతున్నాయి. ఈరోజు ఉదయం పొగమంచు కారణంగా హైవేపై దాదాపు 24 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. పలువురికి గాయాలయ్యాయి.
పంజాబ్, హర్యానాల వల్లనేనా?
వాతవరణంలో గాలి నాణ్యత తీవ్రంగా తగ్గిపోవడంతో అనేక వ్యాధులు సంక్రమించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత 500 కు చేరింది. ఇది ప్రమాదకరమని అంటున్నారు. మరోవైపు ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ అనేక సూచనలు చేసింది. ఈ సూచనల ప్రకారం వాహనాలు బయటకు తెచ్చి పార్కింగ్ చేస్తే నాలుగు రెట్లు పార్కింగ్ ఫీజు పెంచాలని కోరింది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని, మెట్రో రైలు ఛార్జీలను గణనీయంగా తగ్గించాలని కమిటీ సూచించింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇక ఢిల్లీలో వాయుకాలుష్యం పెరగడానికి పంజాబ్, హర్యానాలదే బాధ్యత అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. అక్కడ రైతులు కొత్త పంట వేయడానిక పాత పంటలను పొలాల్లోనే తగలబెడతుండటంతో ఈ కాలుష్యం పెరగడానికి కారణమని ఆప్ ఆరోపిస్తుంది. అయితే పంజాబ్, హర్యానాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. త్వరలో సమావేశమై దీనిపై చర్చించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం మీద ఢిల్లీలోని వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

