కాపు కార్పొరేషన్ లో కొట్టుకు చస్తున్నారే...!!

కాపు కార్పొరేషన్ కి ఏమైంది ..? అక్కడ ఛైర్మెన్ రామాంజనేయులు వెర్సెస్ ఎండి అమరేందర్ నడుమ సాగుతున్న అంతర్గత యుద్ధం రోడ్డెక్కేసింది. తాజాగా ఎండి అమరేందర్ ను సర్కార్ సాగనంపడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యి ఛైర్మన్ కి వ్యతిరేకంగా కార్పొరేషన్ కార్యాలయంలోనే మీడియా సమావేశం పెట్టేశారు. ఇది తెలుసుకున్న రామాంజనేయులు అక్కడికి చేరుకొని మాజీ ఎండి తో వాగ్యుద్ధానికి దిగారు. ఇది తన కార్యాలయమని ఆయనకు ఇక్కడ మీటింగ్ పెట్టె హక్కే లేదని అయినా కానీ ఆయన ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే తానూ పక్కనే కూర్చుని తాను చెప్పేది చెబుతా అంటూ వ్యాఖ్యానించారు రామాంజనేయులు. దాంతో మాజీ ఎండి బయట మీడియా వారితో మాట్లాడారు.
చాలా కాలంగా ఛైర్మన్, ఎండి నడుమ ఉప్పు నిప్పే .....
కాపు కార్పొరేషన్ ఏర్పాటే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఉద్యమంతో హడావిడిగా మొదలైంది. ఈ కార్పొరేషన్ కి ఛైర్మెన్ గా రామాంజనేయులు ఎండి గా అమరేందర్ నడుమ తొలినుంచి వివాదాలు అంతర్గతంగా నడుస్తూనే వున్నాయి. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగానికి ఎండి అమరేందర్ బాధ్యులంటూ సీఎం ముందు రామాంజనేయులు పంచాయతీలు పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య వివాదానికి చెక్ పెడుతూ ప్రభుత్వం ఎండి ని తప్పించింది.
ఒకరిపై ఒకరు ఫైర్ ......
ఇక మీడియా సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయం బయట పెట్టిన అమరేందర్ చైర్మన్ రామాంజనేయులపై నిప్పులు చెరిగారు. ఆయన కావాలనే తనపై కొన్ని పత్రికల్లో కధనాలు రాయించారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి కుట్ర జరుగుతుందని ముఖ్యమంత్రి గుర్తించాలన్నారు . మరోవైపు రామాంజనేయులు ఈ ఆరోపణలను ఖండించారు . ఎండి వల్ల కార్పొరేషన్ నిధులు దుర్వినియోగం అయ్యాయన్నారు. ఇలా ఒకరిపై మరొకరు కారాలు మిరియాలు నూరుకున్నారు. మొత్తానికి వీరి వివాదం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది .
- Tags
- కాపు కార్పొరేషన్

