కాపుల సమావేశంపై చంద్రబాబు నిఘా కన్ను!

ముద్రగడ పద్మనాభం తాను చేయదలచుకున్న కాపు ఉద్యమానికి హైదరాబాదునుంచి కూడా ఏపీ కాపుల మద్దతు కూడగట్టడానికి కొన్ని వారాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఆయన హైదరాబాదుకు వచ్చి దాసరి నారాయణరావు ఇంట్లో కొందరు కాపు ప్రముఖులతో కలిసి సమావేశం నిర్వహించారు. అనంతరం రాజమండ్రిలో ఓ సన్నాహక సమావేశం లాంటిది పెట్టుకున్నారు. ఇవాళ మంగళవారం మరో దశగా కాపు పెద్దల సమావేశం హైదరాబాదులో పెట్టుకున్నారు. హోటల్ దసపల్లాలో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు.
సాయంత్రం వరకు సమావేశం జరిగిన తర్వాత.. కాపుల రిజర్వేషన్ సాధించడం కోసం ఎలాంటి కార్యాచరణతో తాము ముందుకు వెళ్లబోతున్నామో దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం వివరాలను ప్రకటించారు. మండలం నుంచి జిల్లా స్థాయి వరకు కాపు జేఏసీలను ఏర్పాటుచేసి.. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నామని వారు ప్రకటించారు.
అయితే ఈ సందర్భంగా దాసరి నారాయణరావు చేసిన ఓ వ్యాఖ్య చాలా కీలకంగా ఉంది. సమావేశం వివరాల్ని మేం ప్రత్యేకంగా ప్రకటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మా సమావేశాన్ని సీసీ కెమెరాల ద్వారా సాంతం షూట్ చేసేశారని.. ఇప్పుడే నాకు తెలిసింది. బహుశా ఈ పాటికే ఆ సీసీ కెమెరా ఫుటేజీ.. మా సమావేశంలో ఎవరు ఏం మాట్లాడారు? ఎవరు ఏం చెప్పారు? అనేది చంద్రబాబునాయుడుకు చేరిపోయి ఉంటుంది. ఏం పర్లేదు. మాకేం భయం లేదు. అంటూ దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు.
దాసరి మాటలను బట్టి.. వారికి తెలియకుండా.. వారి సమావేశాన్ని సీసీ టీవీల్లో రికార్డు చేయించినట్లుగా దాసరి ఆరోపణలు ఉన్నాయి.

