కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడిన డీజీపీ

అతనో పోలీస్ బాస్.. పోలీసుల సంక్షేమం కోసం పరితపిస్తారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది యోగ క్షేమాలను మర్చిపోరని నిరూపించారు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ. ఆయన సకాలంలో స్పందించడంతో ఒక కానిస్టేబుల్ ప్రాణాలు నిలిచాయి. వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పోలీస్ కమిషనేరేట్ పరిధిలోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో విష్ణువర్ధన్ రెడ్డి(31) కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను 2009 బ్యాచ్ కు చెందిన వాడు. అయితే నెలరోజుల క్రితం ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతూ ఎల్బీ నగర్ లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. కాగా ఇతనికి న్యుమోనియా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఊపిరితిత్తులు గట్టిపడి శ్వాస ఆడక ఇబ్బంది పడుతుండడంతో డాక్టర్లు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో ఎక్మో చికిత్స అవసరమని, తమ వద్ద అది అందుబాటులో లేదని డాక్టర్లు తెలిపారు. ఇది ఖర్చు, రిస్క్ తో కూడిన ఎక్మో చికిత్సను గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఈ ట్రీట్ మెంట్ అందించారు. ఎక్మో చికిత్సకు రోజుకు రూ. 1,00,000 ఖర్చు అవుతుంది. ఆరోగ్య భద్రత నుంచి వైరల్ ఫీవర్ కు రూ. 5 లక్షల వరకే వర్తిస్తుంది. అయితే కానిస్టేబుల్ చికిత్సకు లక్షల్లో ఉంటుంది. ఈ విషయాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ దృష్టికి పోలీసు అధికారుల సఘం అధ్యక్షులు భద్రా రెడ్డి తీసుకెళ్లగా ఆయన చలించిపోయి డీజీపీకి రిఫర్ చేశారు.
ఖర్చు మొత్తం చెల్లించి......
వారి సూచనల మేరకు పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి కిమ్స్ హాస్పిటల్ పిఆర్ఓ శ్రీనివాస్ తో మాట్లాడి పరిస్థితి వివరించారు. ఆరోగ్య భద్రత సెక్రటరీ గోపాల్ రెడ్డిచే కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడిపించి ప్రత్యేక అంబులెన్స్ లో కానిస్టేబుల్ ను కిమ్స్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేశారు. కిమ్స్ లో ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్స జరపగా 25 రోజుల తరువాత అతను కోలుకున్నాడు. ఇందుకు అదనంగా 18.56 లక్షలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని ఆరోగ్య భద్రత నుండి ఇప్పించవలసింది గా డిజిపిని కలిసి కోరారు. డిజిపి వెంటనే స్పందించి ఆ మొత్తం మంజూరు చేశారు. నెల రోజుల నుండి కిమ్స్ డాక్టర్లు లతా శర్మా, నందా కిశోర్ ప్రత్యేకంగా ట్రీట్ మెంట్ చేయడంతో అతను త్వరగా కోలుకున్నాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకున్నందుకు డిజిపి అనురాగ్ శర్మ, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, కిమ్స్ వైద్యులు, రాష్ట్ర పోలిస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపి రెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మరియు తదితరులకు సైబరాబాద్, రాచకొండ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

