కాంగ్రెస్ లో ఎన్నడూ లేనిది...ఎందుకంత జోష్?

ఎప్పుడూ లేదు... కాంగ్రెస్ పార్టీ రెట్టింపు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నెల 27వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలపై ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభ పక్షం సమావేశమయింది. ఈరోజు మరోసారి అసెంబ్లీ సమావేశాలపై చర్చించడానికి కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. అయితే ఈసారి సమావేశాల్లో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయడానికి కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. అందుకోసం గట్టిగా ప్రిపేర్ అవుతున్నారు. అధికార పార్టీపై అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కాలుదువ్వడానికే రెడీ అవుతున్నారు హస్తం పార్టీ నేతలు.
ప్రభుత్వాన్ని నిలదీసేందుకు.....
మొత్తం 17 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి ఖచ్చితమైన సమాధానాలను రాబట్టాలని అనుకుంటోంది. ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సమాధానం చెప్పేవరకూ సభను స్థంభింపచేయాలని నిర్ణయం ఇప్పటికే తీసుకుంది. అంతేకాకుండా నేరేళ్ల ఘటన, ఖమ్మం మిర్చి యార్డులో రైతులకు బేడీలు వేయడం, రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్ల ఫ్యాక్టరీకి భూసేకరణ, తెలంగాణ జేఏసీ కోదండరామ్ అక్రమ అరెస్ట్ లపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ 17 అంశాలను ఒక్కొక్క నేతకు అప్పగించి వారిచేతనే సభలో మాట్లాడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మంగళవారం ఒకసారి సమావేశమై... మరోసారి ఈ నెల 26వ తేదీన సీఎల్పీ సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నట్లుసమాచారం. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగినట్లే కన్పిస్తోంది.
- Tags
- కాంగ్రెస్

