కాంగ్రెస్ ను ఉతికారేయడమే లక్ష్యంగా...!

పార్లమెంటులో ఈరోజు మోడీ ప్రసంగం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినట్లు లేదు. కాంగ్రెస్ ను ఉతికి ఆరేయడమే లక్ష్యంగా మోడీ పెట్టుకున్నట్లున్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో మోడీ ప్రసంగించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్పడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సుదీర్ఘ కాలం ఎలా నాశనం చేసిందో ప్రధాని మోడీ వివరించారు. మోడీ ప్రసంగానికి కొందరు అడ్డుతగులుతుండటంతో వినేందుకు ధైర్యం లేకనే కాంగ్రెస్ పార్టీ తన ప్రసంగాన్ని అడ్డుకుంటుందని మోడీ విమర్శించారు. అయితే దేశంలో జరిగిన అవినీతికి కాంగ్రెస్ మాత్రమే ప్రధాన కారణమని చెబుతూ, పార్టీలు ఎప్పుడూ శాశ్వతం కాదని, దేశమే శాశ్వతమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రోజుకు దేశంలో 11కిలోమీటర్ల రోడ్డు వేస్తే తమ పరిపాలనలో ఈరోజు రోజుకు 22 కిలోమీటర్లు వేస్తున్నట్లు చెప్పారు. రెట్టింపు వేగంతో తాము వెళుతున్నట్లు మోడీ చెప్పకనే చెప్పారు.
ఎవరిపై వివక్ష లేదు..
తమ పాలనలో ఎలాంటి వివక్ష చూపలేదన్న మోడీ, అది ప్రతిపక్ష సభ్యుడికి చెందిన నియోజకవర్గమా? పాలకపక్ష సభ్యుడి నియోజకవర్గమా? అన్నది తానెన్నడూ చూడలేదన్నారు. అభివృద్ధి దేశమంతటా ఉండాలన్నదే తమ పార్టీ అభిమతమని ఆయన వెల్లడించారు. మధ్యమధ్యలో చురకులు కూడా అంటించారు. కర్ణాటకలో 1020 కిలోమీటర్ల మేర రైల్వేలైనును అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వంలో వేశారని, మరి ఖర్గే రైల్వే మంత్రిగా ఉండి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామన్న మోడీ, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కాంగ్రెస్ ముక్త భారత్ ను తాము కోరలేదని ఆనాడే గాంధీజీ కోరారన్నారు.
అవినీతికి ఆస్కారం లేకుండా....
ఆధార్ వ్యవస్థకు తాను స్వస్తి చెబుతానని ఎన్నికల ముందు కాంగ్రెస్ విపరీతంగా ప్రచారం చేసిందని, అయితే తాను అధికారంలోకి వచ్చిన తరవ్ాత ఆధార్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు గుర్తు చేశారు. కాని ఇప్పుడు ఆధార్ వద్దంటూ ప్రజల్లో తప్పుడు ప్రచారానికి కొందరు దిగుతున్నారని ఆరోపించారు. తమ పాలనలో అవినీతికి చోటు లేకుండా చేశామన్న ఆయన... దళారి వ్యవస్థకు కూడా కళ్లెం వేయగలిగామని గర్వంగా చెప్పుకోగలమన్నారు. కాని కాంగ్రెస్ హయాంలో రోజుకో అవినీతి బయటకు వచ్చేదని వ్యంగ్యంగా విమర్శించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఉండటం కూడా కష్టమేనని చెప్పుకొచ్చారు. మొత్తం మీద మోడీ ప్రసంగం మొత్తం కాంగ్రెస్ ను తిట్టడంతోనే సరిపోయింది. అయితే మోడీ దాదాపు గంటా నలభై నిమిషాలు ప్రసంగించారు. మోడీ ప్రసంగిస్తున్న సేపూ కాంగ్రెస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తూనే ఉన్నారు.
- Tags
- మోడీ

