కాంగ్రెస్ నయా ప్లాన్ .... వర్క్ అవుట్ అవుతుందా?

వ్యూహం-ప్రతివ్యూహం రాజకీయాలకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు! ఇవి లేకపోతే.. రాజకీయాలే లేవు. ఇక, తలపండిన కాంగ్రెస్ వంటి 133 ఏళ్ల పార్టీకి ఈ రెండు విషయాలూ కొట్టిన పిండి! తెలంగాణలో ఈ రెండు విషయాలతోనే ఇకపై కాంగ్రెస్ పయనించాలని నిర్ణయించుకుంది. అధికార టీఆర్ఎస్ను గద్దె దింపేందుకు వినూత్న ప్రయత్నంగా వ్యక్తులను చేరదీయడంతోపాటు జిల్లాలకు జిల్లాలనే తన ఖాతాలో వేసుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలోనే దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో కాంగ్రెస్ కూసాలను మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా అధికార పార్టీని ఆయా జిల్లాల్లో నామరూపాలు సైతం లేకుండా చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర సారధులు నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు.
మైండ్ గేమ్ ప్రారంభించి....
2019లో తిరిగి అధికారంలో కొనసాగేలా సీఎం కేసీఆర్ వ్యూహం సిద్ధం చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలను చేరదీస్తున్నారు. నాకే కాదు మీకూ కొంత అంటూ వివిధ పథకాలతో వారిని ఊరిస్తున్నారు. దీంతో మేల్కొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాలని ప్రతి వ్యూహంపై పక్కా స్కెచ్ సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే తనకు బలంగా ఉన్న జిల్లాలను మరింత బలోపేతం చేసేదిశగా అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యేలను సైతం తనవైపునకు తిప్పుకునే దిశగా అడుగులు ప్రారంభించింది. ఇదే విషయాన్ని ఇటీవల టీ-కాంగ్రెస్ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కూడా ఆయన చెప్పారు. ఇందులో వాస్తవాలూ ఉండొచ్చు. టీ కాంగ్రెస్ మైండ్ గేమ్ వ్యూహాన్ని కాదనలేం.
ఈ నాలుగు చోట్ల.....
ఇదిలా ఉంటే ఎన్నికలకు మరో 15 నెలల టైం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ కేసీఆర్‌ను గద్దె దింపేందుకు పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతున్నట్టే కనపడుతోంది. నల్గొండ, మహబూబ్‌నగర్, గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం జిల్లాలను కాంగ్రెస్‌కు కంచుకోటలుగా మలచాలని డిసైడ్ అయ్యింది. ఈ జిల్లాల్లో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. వీటిని పూర్తిగా లేదా ఒకటి రెండు తగ్గినా.. కూడా టోకుగా కాంగ్రెస్ జెండా ఎగిరేలా చేయగలిగితే.. టీఆర్ఎస్ను ఓడించడం ఓటుతో పెట్టిన విద్యే అవుతుందని ఉత్తమ్ టీం భావిస్తోంది. వాస్తవానికి ఇవన్నీ కాంగ్రెస్‌కు పెట్టని కోటలు. దక్షణి తెలంగాణ జిల్లాలుగా పేరున్న ఇక్కడ కాంగ్రెస్‌కు ఎప్పుడూ గట్టి పట్టే ఉంది.
ఈ లెక్కలు నిజమైతే....
ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూసినా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పాటు మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ బలంగా ఉంది. ఈ జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల ప్రధానంగా దృష్టి పెట్టడంతో పాటు తెలంగాణ జిల్లాల్లో 80-90 శాతం సీట్లు గెలిస్తే కేసీఆర్‌ను గద్దె దింపవచ్చన్నది టీ కాంగ్రెస్ వ్యూహం. రాష్ట్రంలో ఏ సంస్థ సర్వే చేసినా, అధికార పార్టీ చేసుకున్న సర్వే అయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే చెబుతున్నాయన్నది ఉత్తమ్ ధీమా. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు 70 స్థానాలకు పైగా వస్తాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆయా జిల్లాల్లో టీఆర్ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారని కూడా ఉత్తమ్ చెప్పుకొచ్చారు. ఈ లెక్కన చూస్తే.. ఖమ్మం-10, నల్గొండ-12, మహబూబ్‌నగర్-14, గ్రేటర్ హైదరాబాద్-15, రంగారెడ్డి-14 చొప్పున ఈ జిల్లాల్లో ఎమ్మెల్యే సీట్లున్నాయి. వీటిని పూర్తిగా కైవసం చేసుకోగలిగితే.. అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన బలం దాదాపు చేకూరినట్టేనని భావిస్తున్నారు. మరి టీ కాంగ్రెస్ లెక్కలు ఎలా మారతాయో ? చూడాలి.
- Tags
- కాంగ్రెస్

