కస్టడీ పొడిగింపుతో హనీ మత్తు వదిలిందా ...?

గుర్మీత్ రామ్ రహీం దత్త పుత్రిక వారం రోజులుగా పోలీస్ కస్టడీలో విచారణ బృందాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించారు. విచారణ బృందాలు ప్రశ్నల వర్షానికి ఆమె తొణకలేదు , బెణకలేదు. హనీప్రిత్ ను విచారించడం అంటే తలప్రాణం తోకకు వచ్చినట్లే అని అధికారులు నీరుగారిపోయారు. విచారణ అధికారులకు జోష్ వచ్చేలా కోర్టు సహకరించింది. ఆమె మౌన ముద్రతో కేసు వీగిపోయేలా చేస్తుందని నమ్మిన కోర్టు పోలీస్ కస్టడీ ని పొడిగించడంతో అమ్మడు నిజాలు చెప్పక తప్పలేదు. తాను నోరు మెదిపే వరకు కోర్టు కస్టడీ పొడిగిస్తునే ఉంటుందని హనీప్రిత్ భయపడటమే దీనికి కారణమని పోలీసు వర్గాలు అంటున్నాయి.
ఆమె గుట్టు అలా బయటపడింది ....
గుర్మీత్ ను జైలు కి సాగనంపే వరకు వెంటే వున్న హనీప్రిత్ ఆ తరువాత మాయం అయ్యింది. ఆమె కోసం 38 రోజులపాటు నాలుగు రాష్ట్రాల్లోని ప్రత్యేక పోలీస్ బృందాలు గాలించని చోటు లేదు. అలా ఆమెకోసం విచారిస్తున్న దశలోనే పోలీసులు బాబా ముఖ్య అనుచరులను లోపలేశారు. వారిచ్చిన వివరాలు సాక్ష్యాలు అల్లర్ల వెనుక హనీప్రిత్ స్కెచ్ ను బయటపెట్టాయి. ఆ వివరాలే ఆమె ముందు పెట్టడంతో హనీ వారంపాటు మౌన ముద్రలో వున్నా ఇక చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. కోర్టు తీర్పునకు ముందే శిక్ష పడితే ఏమి చేయాలన్న గుర్మీత్ , హనీప్రిత్ మరికొందరు ముఖ్య అనుచరులు అల్లర్లకు పధక రచన సాగించారు. దీనికోసం అయిన ఖర్చు అంతా హనీప్రిత్ ద్వారానే బట్వాడా కావడం విశేషం.
- Tags
- హనీప్రీత్

