కవిత కోపం నషాళానికెక్కిందే...!

కేసీఆర్ కుమార్తెగానే ప్రజలకు పరిచయం అయినా.. తెలంగాణ ఉద్యమంతో అడుగులు ప్రారంభించిన కల్వకుంట్ల కవిత.. తెలంగాణ జాగృతి పేరుతో ఓ సంస్థను స్థాపించి తనకంటూ ఓ గుర్తింపు సాధించారు. కేవలం తెలంగాణకే పరిమితమై పోయిన బతుకమ్మను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆమె కృషి నిజంగా అద్భుతం. ఇక, ఉద్యమ సమయంలో పంచ్ డైలాగులతో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను ఎండగట్టడంలోనూ తండ్రి తగ్గ తనయగా ఆమె పేరు తెచ్చుకున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ వంటి రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి అత్యధిక మెజారిటీ సొంతం చేసుకున్న తెలంగాణ ఆడపడుచుగా కూడా ఆమె గుర్తింపు సాధించారు.
కేంద్రంపై మండిపాటు...
ఇటీవల రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగిన సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లోనూ కవిత తన పవర్ ఏంటో చూపించారు. అధికార పార్టీ యూనియన్ విజయం సాధించేలా చక్రం తిప్పారు. దీంతో ఆమెకు రాజకీయంగా తిరుగులేదని నిరూపించుకున్నారు. అయితే, తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ సర్కారుకు మధ్య బంధం బలోపేతం అవుతున్న దిశలో కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి. ఉన్నట్టుండి కవిత కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను విశ్లేషణాత్మకంగా వివరిస్తూ… ఒక్కో పథకంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కీలకమైన విద్య, ఉపాధి, వ్యవసాయంపై కేంద్రం అవలంబిస్తున్న తీరును కవిత ఎండగట్టారు.
కేంద్రం నిర్ణయాలు తప్పుల...తడకలు...
కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ప్రగతి భవన్ లో జరిగింది. కేంద్రం ఇస్తున్న నిధులతో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆమె సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ పంటల బీమాపై కేంద్రం వైఖరి సరిగా లేదని తప్పుపట్టారు. పంటల బీమాకు గ్రామాన్ని యూనిట్ గా తీసుకోకుండా రైతును యూనిట్ గా తీసుకుని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకునే కేంద్రం విధానం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. అందుకే ఈ విధానంలో మార్పు చేయాలని ఎంపీ కవిత స్పష్టం చేశారు. అదే విధంగా విద్యారంగంలో తీసుకున్న కీలక నిర్ణయాన్ని ఆమె తప్పుపట్టారు.
అన్నింట్లోనూ కోతేనా....
ఒక పక్క బేటీ బచావో బేటీ పడావో నినాదంతో పాటుగా మహిళా సాధికారత కోసం కృషిచేస్తున్నామని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఆచరణలో అందుకు విరుద్ధంగా పనిచేస్తోందని తప్పుపట్టారు. మహిళా సాధికారత, బాలికలకు భరోసాగా ఉన్నామంటున్న ప్రభుత్వం బాలికలకు విద్యను అందించే….కస్తూరిబా గాంధీ విద్యాలయాలను ఎత్తివేసిందని విమర్శించారు. ఇంతేకాకుండా పేదలకు నష్టం కలిగించే నిర్ణయాన్ని కూడా కేంద్రం తీసుకుందన్నారు. ఉపాధిహామీ నిధుల్లో కోత పెట్టారని, ఫలితంగా కూలీలు నష్టపోయారన్నారు. కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయడం లేదని ఎంపీ కవిత అసహనం వ్యక్తం చేశారు. ఇలా.. కవిత తనదైన స్టైల్లో సటైర్లతో కేంద్రాన్ని మాటలతో కుమ్మేశారు. అసలే ఇప్పుడిప్పుడే కేంద్రంతో కేసీఆర్ మచ్చిక చేసుకుంటుంటే కవిత ఇలా ఫైరవడం సర్వత్రా విస్మయాన్ని కలిగించింది. మరి భవిష్యత్లో ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- ఎంపీ కవిత

