కర్ణాటక...మరో గుజరాత్ కానుందా?

కర్ణాటక ఎన్నికలు మరో గుజరాత్ ను తలపిస్తున్నాయి. కర్ణాటక విధానసభ ఎన్నికలు ఈ ఏడాదే జరుగుతుండటంతో అప్పుడే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ లు కూడా రంగంలోకి దిగాయి. జేడీఎస్, బీఎస్పీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడినా తాము కాంగ్రెస్, బీజేపీకి మద్దతివ్వబోమని ఇప్పటికే జేడీఎస్ స్పష్టం చేసింది. ఇక అధికార, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అప్పుడే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. గుజరాత్ తరహాలో ప్రచారాన్ని చేయాలని కమలనాధులు నిర్ణయించారు. ఇప్పటికే గత ఆదివారం ప్రధాని మోడీ బహిరంగ సభ విజయవంతం కావడంతో మరిన్ని సభలకు బీజేపీ ప్లాన్ చేస్తుంది.
ఎనిమిది సభలతో మోడీ....
మోడీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొననున్నారు. మొత్తం ఆయన ఎనిమిది సభల్లో, ర్యాలీల్లో పాల్గొననున్నారు. కర్ణాటక రాష్ట్రాన్ని మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటీవల లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సమయంలో కూడా ఆయన కర్ణాటక అంశాన్ని ప్రస్తావించడం విశేషం. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఇక్కడ ఉండదని మోడీ ధీమాగా చెప్పారు. అంటే కర్ణాటకను ఎంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ తీసుకుందో మోడీ మాటల్లోనే అర్థమవుతుంది. వచ్చే నెలలో మోడీ బహిరంగసభలు, ర్యాలీలు ప్రారంభం కానున్నాయి. మైసూరు, హుబ్బళ్లి, కలబురగి, బళ్లారి, బెంగళూరు, దావణగెరె, బెళగావి ప్రాంతాల్లో బహిరంగ ప్రధాని మోడీ బహిరంగ సభలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళూరు, సిరిసి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో తాము మళ్లీ అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.
రాహుల్ పర్యటనకూడా....
ఇక ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కర్ణాటకలో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకూ మూడు రోజుల పాటు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. పలు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. రాహుల్ ఏఐసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలిసారి కర్ణాటక వస్తుండటంతో ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, అసంతృప్త నేతలతో కూడా రాహుల్ ఈ సందర్భంగా సమావేశం కానున్నారు. ప్రధానంగా రాహుల్ మోడీ పాలనపై గురిపెట్టే అవకాశముంది. కర్ణాటకలో యడ్యూరప్ప హయాంలో జరిగిన అవినీతి, ఈ బడ్జెట్ లో సామాన్యుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకూ కేంద్ర ప్రభుత్వం ఎలా మోసం చేసిందో తెలియజెప్పనున్నారు. అధికార పార్టీ కావడంతో ప్రజల్లో ఉన్న అసంతృప్తిని పారదోలేందుకు రాహుల్ ప్రయత్నం చేయనున్నారు. రాహుల్ కూడా ఈ మూడు రోజుల పర్యటన తర్వాత తిరిగి మార్చిలో మారోసారి కర్ణాటకలో పర్యటించే అవకాశముంది. మొత్తం మీద గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా కర్ణాటక ప్రచారం సాగనుంది.
- Tags
- కర్ణాటక

