కమల్ టార్గెట్ గా దినకరన్...!

విలక్షణ నటుడు కమల్ హాసన్ కు దినకరన్ వర్గీయుల నుంచి తీవ్ర నిరసన ఎదురవుతోంది. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్కేనగర్ లో దినకరన్ ఓట్లు కొనుగోలు చేశారని కమల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దినకరన్ ను కమల్ దొంగతో పోల్చారు. అసలు ఆర్కేనగర్ ఎన్నిక ఎన్నికే కాదని, ప్రజలు కూడా డబ్బులు తీసుకుని ఓట్లేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కమల్. దీంతో కమల్ దినకరన్ వర్గీయులు తీవ్ర నిరసనలకు దిగారు. ముఖ్యంగా ఆర్కేనగర్ లో కమల్ కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.
కమల్ పై కేసు...
దినకరన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చెన్నైలోని ఆళ్వార్ పేటలో ఉన్న కమల్ ఇంటిని దినకరన్ వర్గీయులు ముట్టడించారు. దీంతో కమల్ ఇంటికి పోలీసు భద్రతను పెంచాల్సి వచ్ిచంది. అలాగే కమల్ హాసన్ వ్యాఖ్యలపై కోయంబత్తూరు కోర్టులో ఇళగో అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలను అవమానపర్చేలా కమల్ వ్యాఖ్యలు ఉన్నాయని, కమల్ ఇంటర్వ్యూ ప్రచురించిన పత్రిక క్లిప్పింగ్ ను కూడా పిటీషన్ కు జత చేశారు. ఈ పిటీషన్ ను ఈ నెల 12న కోర్టు విచారించనుంది. ఇక టీటీవీ మద్దతుదారులయితే కమల్ దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దహనం చేస్తున్నారు. నిన్నటి వరకూ ఆర్కేనగర్, చెన్నైకే పరిమితమైన నిరసనలు ఈరోజు నుంచి తమిళనాడు వ్యాప్తంగా చేయాలని టీటీవీ తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు.
భయపడేది లేదంటున్న కమల్....
అయితే కమల్ హాసన్ మాత్రం తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదంటున్నారు. ఆర్కే నగర్ లో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు. ఇప్పటికీ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని కమల్ చెబుతున్నారు. అంతేకాదు చట్టపరంగా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కునేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు కమల్. దినకరన్ కు తాను సరైన సమాధానం ఇస్తానని అంటున్నారు కమల్. టీటీవీ బెదిరింపులకు లొంగేది లేదని కూడా చెప్పారు. మొత్తం మీద తమిళనాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక తర్వాత కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి.

