కమలంతో నాకు లింకేంటి?

బీజేపీతో కలిసి వెళ్లే పరిస్థితి లేదని, మద్దతిచ్చే అవకాశమే లేదని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ప్రత్యేక హోదా ఇవ్వనని తేల్చి చెప్పడంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రత్యేక హోదా ఇస్తామంటే బీజేపీకి మద్దతిస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ అనుకూల మీడియాలో జగన్ బీజీపీతో జతకడుతున్నట్లు వార్తలువచ్చాయి. టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలిగిన వెంటనే వైసీపీ బీజేపీతో కలిసి నడుస్తుందన్న ప్రచారం ఏపీలో జోరుగా జరిగింది.
ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా...?
అయితే ఈ వార్తలను జగన్ ఖండించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భావించే తాను ఆ ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా రాదని తేల్చి చెప్పిన తర్వాత బీజేపీతో కలిసి వెళ్లడం జరగని పని జగన్ కుండబద్దలు కొట్టేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరు ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం చేస్తానన్నా తాను మద్దతివ్వడానికి రెడీ ఉన్నట్లు జగన్ వెల్లడించారు. తాను తొలినుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూనే ఉన్నానన్నారు.
ఎవరికీ భయపడను....
తనపై కేసులు ఉన్నందునే బీజేపీకి భయపడుతున్నానన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని, ప్రజల ఆకాంక్ష మేరకే నడుచుకుంటానని చెప్పారు. కొందరు కావాలని కుట్రలు చేసి తనపై కేసులు పెట్టించారన్నారు. పార్టీలతో తమకు ఎటువంటి సంబంధం లేదని, ఏ పార్టీ ప్రత్యేక హోదా దానికి జై కొట్టడానికి సిద్ధమని జగన్ తెలిపారు. తనకు ఎవరు మద్దతిచ్చినా, లేకున్నా తాను మాత్రం చిత్తశుద్ధితోనే ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నానని చెప్పారు.
ప్రచారాలను ఎవరూ.....
తాను నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న విషయాన్ని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మాత్రం నాలుగేళ్ల తర్వాత హోదా విషయం గుర్తుకొచ్చిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తలొగ్గారే తప్ప ఆయనకు ఆయనగా కేంద్రం నుంచి వైదొలగలేదని చెప్పారు. బీజేపీతో అంటకాగే ప్రసక్తి లేదని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని జగన్ కోరారు.
- Tags
- జగన్
