కట్టు దాటితే తాట తీస్తారంతే

రాజధాని మహా నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనల నియంత్రణలో కొత్త శకం ఆరంభం కాబోతోంది. ఇన్నేళ్లూ ఉల్లంఘనలకు పాల్పడినా జరిమానాలు కట్టి బయటపడొచ్చని భావించే వాహనదారులు ఇక తస్మాత్ జాగ్రత్త. కట్టు దాటితే తాట తీసేలా పాయింట్ల విధానాన్ని అమలు చేయబోతున్నారు. అందుకు ఆగస్టు 1న ముహూర్తం ఖరారైంది. పెనాల్టీ పాయింట్ల విధానం అమల్లోకి రానుంది. మద్యం తాగి బండి నడిపితే.. సిగ్నలే కదా అని జంప్ చేస్తే.. హెల్మెట్ ఎందుకులే అని లైట్ తీసుకుంటే.. షార్ట్‌కట్ అని రాంగ్రూట్లో వెళ్తే.. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేస్తే.. ఇలా యథేచ్ఛగా ట్రాఫిక్ రూల్స్‌ను ఫాలో కాకపోతే.. మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దవడం ఖాయం. ప్రతి ఉల్లంఘనకు పక్కాగా పాయింట్లు లెక్కగడుతున్నారు పోలీసులు. మొత్తం పాయింట్లు 12కు చేరితే మీ డ్రైవింగ్ లైసెన్స్ రద్దయినట్టే. ఆపై మళ్లీ వాహనం నడిపితే జైలు ఊచలు లెక్కించాల్సిందే. ఇప్పటికే ఈ విధానంపై ట్రయల్ రన్ నిర్వహించిన అధికారులు దేశంలోనే తొలిసారిగా ఆగస్టు 1వ తేదీ నుంచి దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు.
ఇదీ పాయింట్ల పట్టిక...
* ఆటోలో సామర్థ్యం కంటే అదనంగా ప్రయాణికుల్ని ఎక్కిస్తే: 1
* సీట్ బెల్ట్ పెట్టకుండా కారు నడిపితే, శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనం నడిపితే: 1
* గూడ్స్ వాహనాల్లో ప్రయాణికుల్ని తరలిస్తే: 2
* రాంగ్ రూట్లో వాహనం నడిపితే: 2
* ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే/సిగ్నల్ జంపింగ్ చేస్తే/స్టాప్ లైన్ క్రాస్ చేస్తే/ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తే: 2
* జాతీయ రహదారుల్లో రోడ్డు భద్రత నిబంధనలకు విరుద్ధంగా వాహనాన్ని నిలిపితే: 2
* బీమా పత్రాలు లేకుండా వాహనం నడిపితే: 2
* ప్రమాదకర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలకు పబ్లిక్ లయబిలిటీ సర్టిఫకేట్ లేకపోతే: 2
* వాహనదారుల ఐపీసీ 279/336/337/338 సెక్షన్లను ఉల్లంఘిస్తే: 2
* నిర్దేశిత వేగాన్ని మించుతూ, 40 కి.మీ. లోపు వేగంతో వాహనం నడిపితే: 2
* నిర్దేశిత వేగాన్ని మించుతూ, 40 కి.మీ.ల కంటే అదనపు వేగంతో వాహనం నడిపితే: 3
* రేసింగ్‌కు పాల్పడితే: 3
* మద్యం తాగి ద్విచక్రవాహనం నడిపితే: 3
* మద్యం తాగి నాలుగు చక్రాల వాహనం నడిపితే: 4
* మద్యం తాగి బస్సు/క్యాబ్/ఆటో నడిపితే: 5
* ఐపీసీ 304(ఎ), 304(2)ని ఉల్లంఘిస్తే(వాహనం అజాగ్రత్తగా నడిపి ఎదుటి వ్యక్తి మరణించేందుకు కారకులైతే): 5
* వాహనంపై వెళ్తూ గొలుసుచోరీ/దోపిడీకి పాల్పడితే: 5
