ఓ.. రాజా!! మళ్లీ బోనెక్కుతావా!

అందుకనో ఎందుకనో మరోమారు 2జీ కేసు తవ్వాలనే చూస్తోంది కేంద్రం. కేంద్రం తవ్వకూడదు అనుకుంటే టెలికాం సంస్థలే ఆ పని చేస్తాయి. ఆ రోజు తాము కోల్పోయిన భారీ మొత్తాలను నష్ట పరిహారం రూపంలో చెల్లించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. కేంద్రం తమ మాట వినదు గనుక కోర్టుతోనే ఆ మాట చెప్పించాలని చూస్తున్నాయి.
ఇక ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో.. ??
సరైన సాక్ష్యాధారాలు లేనందున 2జీ కేసు డెడ్ ఈజీగా కొట్టేశారు సీబీఐ న్యాయమూర్తి. కేసు నుంచి క్లీన్చిట్ దక్కించుకున్నాక కరుణ గ్యాంగ్ మోడీతో మీ రుణం తీర్చుకోలేమన్న రేంజ్లో ఊగిపోయింది. తమిళ రాజకీయాల్లో బీజేపీ నిలదొక్కుకోవాలన్న తలంపు కాస్త ఆర్కే నగరి ఫలితంతో బెడిసికొట్టింది. ఇప్పుడు మోడీ అండ్ కో డైలమాలో పడిపోయింది. ఏం చేసినా తమిళ నాట ప్రాంతీయ పార్టీల హవానో .. శశికళ అండ్ కో స్పీడ్ నో తగ్గించలేకపోతున్నామన్న అంతర్మథనకు మోడీకో పరిష్కారం దొరికింది.
అదేంటంటే..
2 జీ స్పెక్ట్రం కుంభకోణంలో నిందితులందరికీ పాటియాలా సీబీఐ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో డీఎంకే సంబరాల్లో మునిగిపోయింది. ఆర్కే నగర్లో డిపాజిట్లు గల్లంతైనా కళ్లింతలు చేసుకుని ఆనందోత్సాహాలతో ఊగిపోతోంది. రాజా, మారన్ , కనిమొళి గ్యాంగ్ ఇప్పట్లో ఈ ఉత్సాహం నుంచి తేరుకునేలా లేదు.మరోవైపు కేసు క్లియర్ అయిపోవడంతో అప్పట్లో తమ లైసెన్స్లు రద్దు చేసినందుకు అందుకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని వీడియోకాన్ వంటి సంస్థలు కేంద్రాన్ని కోరుతున్నాయి. వెయ్యి కోట్ల రూపాయలను పరిహారం కింద ఇవ్వాలని వీడియోకాన్ డిమాండ్ చేస్తోంది.అదేవిధంగా లూప్ టెలికాం నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని పట్టుబడుతోంది. దీనిపై కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ తరుణంలో మోడీ తరఫు మనుషులు కూడా కోర్టు మెట్లు ఎక్కడం అనివార్యం.
కమల వికాసం సాధ్యమా...
డీఎంకే ఏఐడీఎంకే కమల్ విశాల్ రజనీ ఇలాఎవరికి వారు తమ పట్టు పెంచుకునేందు తాపత్రయపడుతున్న వేళ మోడీ మన్ కీ బాత్ సగటు తమిళుడు వినిపించుకుంటాడా అంటే సందేహాస్పదమే.. ఎంజీఆర్ రేంజ్ రాజకీయం, కరుణ లాంటి చాతుర్యం ఈ రెండూ కమల్, రజనీలో లేవు.ఇప్పుడున్న పరిస్థితుల్లో శశికళ పొరపాటున బీజేపీ మద్దతుతో జైలు నుంచి బయటకు వస్తే వ్యూహాలు అన్నీ మారిపోతాయి. ఇప్పటిదాకా కాలర్ ఎగరేస్తున్న నేతలంతా చిన్నమ్మకు దాసోహం కావాల్సిందే. కనుక రాష్ట్రంలో బీజేపీ బాగుపడేదేం లేదు కానీ ఈ సారి కంటితుడుపు చర్యగా 2జీ కేసుని తెరపైకి తెచ్చి డీఎంకేతో ఓ ఆట ఆడుకోవచ్చు. ఫలిస్తే బీజేపీదే గెలుపు.. లేకుంటే లేదు. ఎందుకంటే తప్పొకరిది శిక్ష మరొకరిదా అన్నట్లు అన్ని కోట్ల రూపాయలను నష్టపరిహారం కింద టెలికాం సంస్థలకుచెల్లించేందుకు బీజేపీ సిద్ధంగా ఉండదు. నాటి పాపంలో వాటా పంచుకున్నవారికి ఉక్కిరిబిక్కిరి చేయకా మానదు. కనుక 2జీ ఎపిసోడ్ ని మరికొద్ది కాలం కొనసాగిస్తే బీజేపీ కి మేలు. బీజేపీ చాటు బిడ్డగా రజనీలేకుంటే మేలు.వివాదాస్పద వ్యాఖ్యలు చేయక తానేంటో తాను చేయాలనుకుంటున్నదేంటో కమల్ చెబితే ఇంకా మేలు. ఓ కొత్త పార్టీ నెలకొల్పి విశాల్ రంగంలోకి దూకితే ఇంకా మేలు. ఈయనతో వివాదాస్పద హీరో విజయ్ కలిసి పనిచేస్తేనే అనుకున్న ఫలితం రాబట్టుకోవచ్చు. మరి!ఇవన్నీ జరుగుతాయా?రానున్న ఎన్నికల్లో కళింకితుల పోటీని ఏ పార్టీ అయినా నిలువరించగలదా?? ఏమో!! లోగుట్టు పెరుమాళ్లుకెరుక!

