ఒక కోరిక నెరవేరబోతోంది....!

ఏపీ ఎంపీల ఆందోళనకు కేంద్రం కొంచెం దిగివచ్చినట్లు కన్పిస్తుంది. ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన కేంద్రం విశాఖ రైల్వే జోన్ పైనా దృష్టి పెట్టింది. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని సంతృప్తి పర్చడంతో పాటుగా విశాఖ వాసుల సెంటిమెంట్ అయిన రైల్వే జోన్ కు పచ్చ జెండా ఊపాలని భావిస్తోంది. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. వాల్తేరు డివిజన్ లోని 80 శాతాన్ని ఒడిషాకు వదలియాలని నిర్ణయించారు. దీనికి ఏపీ సర్కార్ ఒప్పుకుంటుందా? విశాఖ ప్రాంత వాసులు అంగీకరిస్తారా? అన్నది పక్కన పెడితే ఒడిషా రాష్ట్రాన్ని సంతృప్తి పర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ విన్పిస్తోంది.
రైల్వే పరిధిని తగ్గించి...
కర్ర విరగకూడదు...పాము చావకూడదు.. అన్న సామెతగా విశాఖ రైల్వే జోన్ పై కీలకప్రకటన చేయడానికి సర్వం సిద్ధమయింది. ఈ మేరకు రైల్వే పరిధిని తగ్గించి జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఒడిషాకు చెందిన కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రదాన్ తో కూడా కేంద్రమంత్రి సుజనా చౌదరి చర్చలు జరిపారు. ఒడిషాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే తమకు అభ్యంతరం లేదని ధర్మేంద్ర ప్రదాన్ చెప్పడంతో ఈ ఫైల్ కదలిక ప్రారంభమయినట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ రైల్వే జోన్ లో కలుపుతారు.
ప్రకటన త్వరలోనే....
అలాగే ప్రస్తుతం వాల్తేరు డివిజన్ లో ఉన్న 80 శాతం ఒడిషాకు వదిలేస్తారు. దీంతో ఒడిషా వాసులు కూడా సంతృప్తి పడతారు. అయితే దీనిపై ప్రకటన అతి త్వరలోనే వచ్చే అవకాశముందంటున్నారు. పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే లోగా ఈ ప్రకటన చేయాలని అమిత్ షా రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ కు సూచించారు. తొలుత దీనిపై కమిటీని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు. అయితే కమిటీ లేకుండానే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై విధివిధానాలను రూపొందించాలని మంత్రి పియూష్ గోయల్ అధికారులను ఆదేశించారు. పరిపాలన సంబంధమైన వ్యవహారమే కావడంతో ప్రకటన త్వరలోనే వస్తుందన్న ఆశాభావాన్ని టీడీపీ, బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆయన అనుమతితో ప్రకటన చేస్తారని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.
- Tags
- చంద్రబాబు

