ఒకటేనంటారు..ఒకటి కారు

పదవుల్లో ఉంటే వాటిని కాపాడుకోవడం ఒక్కటే ముఖ్యంకాదు. భవిష్యత్తులో తమ పదవులకు ఎసరు రాకుండా చూసుకోవడం కూడా రాజీకీయాల్లో ఒక భాగమే. రాజకీయాల్లో మిత్రులు శత్రువులవుతారు. శత్రువులు మిత్రులవుతారు.ఇది సహజం. తమిళనాట జరగుతున్న తంతు చూస్తుంటే పదవుల కోసం మొదలైన పంచాయతీ ఎటువైపు దారితీస్తుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఒక్కటై చిన్నమ్మ కుటుంబాన్ని బయటకు సాగనంపారు. తనను ముఖ్యమంత్రినిచేసిన చిన్నమ్మపై ఏమాత్రం కనికరం చూపకుండా ఆమెతో పాటు ఆమె మేనల్లుడు దినకరన్ ను కూడా పార్టీ నుంచి బయటకు గెంటేశారు. పదవుల నుంచి తొలగించారు.
వేల సంఖ్యలో పోస్టులు ఖాళీ....
అంతేకాదు మన్నార్ గుడి మాఫియా వాసనే పార్టీలో ఉండకూడదని భావించిన ఈ ఇద్దరు దాదాపు వేయి మందికి పైగా దినకరన్ మద్దతుదారులను పార్టీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. వీరంతా జిల్లాల్లో పార్టీలో వివిధ పదవుల్లో ఉన్నారు. అయితే వీరిని తొలగించడం బాగానే ఉంది. కొత్తవారిని నియామకంలోనే కిరికిరి ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా పార్టీ పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి పళనిస్వామి తన అనుయాయులకే పెద్దపీట వేయాలని చూస్తున్నారు. ఇప్పటికే జిల్లా కార్యదర్శుల్లో ఎక్కువమంది పళనిస్వామి వర్గం వారే. భవిష్యత్తులో తన నాయకత్వానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఆయన ముందు జాగ్రత్తగా ఈ నియామకాల్లో తన మనుషులు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
తమ వర్గానికే ఇవ్వాలంటున్న...
అయితే దీనికి పన్నీర్ సెల్వం వర్గం అడ్డుకుంటోంది. తమ వారికే ఈ పదవుల్లో పెద్దపీట వేయాలని పట్టుబడుతోంది. ఈ మేరకు ఒక జాబితాను రూపొందించిన పన్నీర్ సెల్వం వర్గం పళనిస్వామి ముందుంచిందని చెబుతున్నారు. పళనిస్వామి పాతుకు పోకుండా తమ వర్గం నేతలు కూడా పార్టీ పదవుల్లో ఉండాలని, జిల్లాల్లోనూ తమకు పట్టు ఉండాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. దీంతో పదవుల భర్తీలో వీరిద్దరి మధ్య కొంత అభిప్రాయ బేధాలు తలెత్తినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పళనిస్వామి మాత్రం పన్నీర్ ప్రతిపాదనలకు అంగీకరించడం లేదు.
పళని ససేమిరా.....
దీంతో కొత్తగా పదవుల భర్తీకి మార్గదర్శకాలను రూపొందించేందుకు ఒక కమిటీని నియమించాలని పన్నీర్ గట్టిగానే కోరుతున్నారు. తమకు ప్రాధాన్యత లేకుండా పదవుల పందేరం జరగడానికి వీల్లేదంటున్నారు. ఈ నేపధ్యంలోనే పళనిస్వామి వర్గం నిర్వహించే కార్యక్రమాలకు పన్నీర్ సెల్వం వర్గం దూరంగా ఉంటుండటం కూడా అనేక ఊహాగానాలకు ఊతమిస్తున్నాయి. వీరిద్దరి మధ్య అనేక విషయాల్లో విభేదాలు తలెత్తాయని, వాటిని పరిష్కరించుకోకుండా ఇలాగే కొనసాగితే దూరం మరింత పెరిగే అవకాశముందంటున్నారు. పళనిస్వామి మాత్రం తన వర్గం వారినే నియమించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి ఇద్దరూ కలిసి పదవులను భర్తీ చేసుకుంటారా? లేక రెండు వర్గాలు వీధిన పడతాయా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

