ఐలయ్య పుస్తకం - రామాయణ విష వృక్షం - పోలికలు , భేదాలు

ఐలయ్య పుస్తకం మీద రేగిన దుమారం , జరుగుతున్న రచ్చ . 70 వ దశకం చివర్లో , ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు ' రామాయణ విష వృక్షం " అనే పుస్తకం రాశారు . భారతీయులకి ఆరాధ్యమైన రామాయణాన్నీ , రాముడినీ ఏకి పారేస్తూ రాసిన పుస్తకం . రంగనాయకమ్మ గారు చేసిన సాహసం తో పోలిస్తే , ఐలయ్య నథింగ్ . ఈ ఐలయ్య అనే శాల్తీ - రంగనాయకమ్మ గారి తో పోలిస్తే , తాత్వికంగా ఒక మరుగుజ్జు , అల్పుడు , అంగుష్ట మాత్రుడు . చాలా వివాదం చెలరేగింది అప్పుడు . మేము స్కూల్ లో ఉన్నాము . కానీ ఈ లెవెల్ వ్యక్తిగత విమర్శలు లేవు. ' విష వృక్షం " పుస్తకాన్ని నిషేధించమని ఎవరూ కోర్టు లలో కేసు వేయలేదు నాకు తెలిసి ( నేను స్కూల్ లో ఉన్నాను ; నా పరిధి తక్కువ ) . ఆఖరికి చాందస వాది , " ముసలి దాన్ని, మూల కూర్చున్న దాన్ని , మను ధర్మ శాస్త్ర పందిరి లో , మనువాడాలన్న తొందరలో, మంచి చెడ్డా మరిచి పోయిన " విశ్వనాథ సత్య నారాయణ గారు కూడా కేసు వెయ్య లేదు. ఎందుకో తెలియదు.
గొప్ప పుస్తకాల్లో ఒకటి.....
" రామాయన విష వృక్షం " తెలుగు సాహిత్యం లో వచ్చిన గొప్ప పుస్తకాలలో ఒకటి - అని నా వ్యక్తిగత అభిప్రాయం . పాత పుక్కిటి పురాణాలని కొత్త దృష్టి కోణం నుంచి చూడాల్సిన అవసరం ఉంది అని నాకు మొట్ట మొదట ఎరుక కలుగ జేసిన పుస్తకం " రామాయణ విష వృక్షం ". ఒక సంవత్సరం తరువాత , 1980 లో అనుకుంటాను , డాక్టర్ తెన్నేటి హేమలత గారు " రామాయణ విష వృక్ష ఖండన " రాశారు. రంగ నాయకమ్మ గారు ఎంత గొప్ప ఫెమినిష్టో , డాక్టర్ తెన్నేటి హేమ లత గారు కూడా అంత గొప్ప స్త్రీ వాది . ఎందులోనూ తక్కువ కాదు.ఇద్దరూ చలం అభిమానులే . కాకపోతే , లత గారు , మతం , దేవుడి పై అపార నమ్మకం ఉన్న స్త్రీ వాది . రంగనాయకమ్మ గారు మార్క్సిస్ట్ - నాస్తిక ఫెమినిస్టు . ఇద్దరూ ఒక తరం స్త్రీ పురుషుల ఆలోచనా విధానాన్ని మార్చ్హి , చెరగని ముద్ర వేసిన గొప్ప రచయిత్రులు.అది నచ్చిన వారు అది చదివారు , ఇది నచ్చిన వారు ఇది చదివారు . రెండు చదివిన వారు వార / పక్ష / మాస / దిన పత్రికలలో మేధో పరమైన చర్చ చేశారు. అది ఇప్పుడు జరగటం లేదు . ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు . ఆర్య వైశ్య మిత్రులు , ఐలయ్య గారి పుస్తకానికి , పాయింట్ టు పాయింట్ " ఖండన " రాస్తే బాగుండు నని నా అభిప్రాయం. చివరిగా, గాంధీ గారి కొటేషన్ తో ముగిస్తాను . " నీ అనుమతి లేకుండా , నిన్ను ఎవ్వరూ అవమానించ లేరు !
మహాత్ముడి మాటలు వినండి......
" వివరణ : ఠాగూరు , గాంధీ ని ' మహాత్మా ! " అన్నాడు . దేశం మొత్తం ఆయనని మహాత్ముడి కింద కొలిచింది. బ్రిటన్ ప్రధాన మంత్రి విన్ స్టన్ చర్చిల్ , గాంధీ ని " బట్టల్లేని పకీరు " తప్ప ఇంకేమీ కాదన్నాడు . విలేకరులు, ఈ అవహేళన ని గాంధీ గారి దగ్గరికి మోసుకెళ్ళి , ' చర్చిల్ గారి ఈ అవమాన కరమైన వ్యాఖ్య కి మీ ప్రతిస్పందన ఏమిటి ? " అని అడిగారు . గాంధీ గారు నవ్వి , పై మాట అన్నారు " మన అనుమతి లేకుండా మనని ఎవరూ అవమాన పరచ లేరు " అని ఇది జరిగిన తరువాతి బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలలో , చర్చిల్ ఓడి పోయారు , ఆయన చిరకాల ప్రతర్ధి , సామ్రాజ్య వాద వ్యతిరేకి అయిన ' క్లిమెంట్ అట్లీ ' బ్రిటన్ ప్రధాని అయారు . ఆయన 1945 లో ప్రధాని కావడం కూడా, మనకి 1947 లో స్వతంత్రం రావడానికి దోహద పడింది . అది వేరే విషయం . ఐలయ్య గారు పుస్తకానికి మొదటి ప్రతిస్పందన - పట్టించుకోక పోవడం . ఒకవేళ ఆ పుస్తకం కొందరు పాఠకులను ప్రభావితం చేస్తుంది అనుకుంటే , రెండవ ప్రతిస్పందన , దానికో " ఖండన " రాయడం.
కొసమెరుపు : ' రామాయణ విష వృక్షం ' పుస్తకానికి అట్ట మీది బొమ్మ , బాపు గారు వేశారు ! రామ భక్తుడూ , ' సంపూర్ణ రామాయణం ' వంటి సినిమాలు తీసిన , రాముడి ప్రస్తావన లేకుండా సాంఘిక సినిమాలు కూడా తీయని బాపు గారు ! దానికి పారితోషికం గా , రంగనాయమ్మ గారు పారితోషికం పంపించారు , బాపు గారికి . ఆ డబ్బు ని తిరిపి పంపిస్తూ ' ఇది ఆ రాముడికే అంకితం . భద్రాచలానికి ఎం వో చేయండి ' అని లేఖ జోడించి పంపించారు . భావ జాలానికి అతీతమైన వ్యక్తిగత సంబంధాలు - మళ్ళీ పునరుజ్జీవం అయితే బాగుండు !
-తెలుగుపోస్ట్ పాఠకుని స్పందన.వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
- Tags
- కంచె ఐలయ్య

