ఏపీ బీజేపీలో ఇదే హాట్ టాపిక్

బీజేపీలో వారసత్వానికి అవకాశమంటూ పెద్దగా ఉండదు. నేతల కుటుంబ సభ్యులను కూడా దూరంగా ఉంచుతుంటారు. అలాంటిది ఇప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వారసుడు వస్తున్నారన్న టాక్ పొలిటికల్ కారిడార్ లలో బలంగా విన్పిస్తుది. అయితే వెంకయ్య కుమార్తె, కుమారులు రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేయనున్నారు. వెంకయ్య కుమార్తె సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా, ఆయన కుమారుడు మాత్రం వ్యాపారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇక వెంకయ్యకు రాజకీయ వారసుడెవరనేదేగా మీ ప్రశ్న. అదే వెంకయ్యనాయుడు కేంద్రమంత్రివర్గంలో పనిచేసినప్పుడు ఆయన సమీప బంధువు సత్య వెంకయ్య పర్సనల్ అసిస్టెంట్ గానూ, ఓఎస్డీగానూ వ్యవహరించారు. సత్య వెంకయ్యకు దూరపు బంధువు కావడంతో ఆయన రాజకీయ అరంగేట్రానికి అంతా సిద్ధమైందంటున్నారు.
రాజంపేట స్థానం నుంచి.....
సత్య గత ఎన్నికల్లోనే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. అయితే వెంకయ్యనాయుడు మందలించి పక్కన పెట్టారన్నది టాక్. ఇప్పుడు వెంకయ్య నాయుడు క్రియాశీల రాజకీయాలకు దూరం కావడంతో సత్య మరోసారి తన మనసులో మాటను వెంకయ్య ముందుంచారట. తనకు రాజకీయాల్లోకి రావాలన్న కోరిక బలంగా ఉందని, ఆశీస్సులు కావాలని కోరారు. అందుకు వెంకయ్య కూడా సమ్మతించినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీచేసేందుకు సత్య సిద్ధమవుతున్నారని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పడం విశేషం. మరి వెంకయ్య వారసుడిగా సత్య రాజకీయాల్లో నెట్టుకొస్తారా? లేదా? కాలమే సమాధానం చెబుతుంది. ఇప్పుడు ఏపీ బీజేపీలో సత్య రాజకీయ రంగప్రవేశంపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
- Tags
- బీజేపీ

