ఏపీ బంధం తెగింది: ఇక వెలగపూడి నుంచే!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాసులకు తెలంగాణతో ఇక వ్యక్తిగత అనుబంధాలు ఉండాల్సిందే తప్ప.. రాష్ట్ర పరిపాలన వ్యవహారాల పరంగా సంబంధం పూర్తయిపోయింది. హైదరాబాదులో ఉన్న సచివాలయం పూర్తిస్థాయిలో తరలిపోయింది. సోమవారం నుంచి ఏపీ సచివాలయం పూర్తిస్థాయిలో గుంటూరుజిల్లా అమరావతిలోని వెలగపూడి లో నిర్మించిన నూతన భవనాల్లోనే పనిచేయనుంది. మొత్తం సెక్రటేరియేట్ తరలిపోవడంతో.. రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో.. చీలికకు సంబంధించి ఒక కీలక పర్వం పూర్తయినట్లయింది.
నిజానికి హైదరాబాదు నగరాన్ని పదేళ్లపాటూ రాజధానిగా వాడుకునే వెసులు బాటు విభజన చట్టం ప్రకారం ఏపీకి ఉన్నప్పటికీ.. చంద్రబాబునాయుడు.. చాలా త్వరితగతిన పరిపాలనను స్వరాష్ట్రానికి తీసుకెళ్లడం మీద శ్రద్ధ పెట్టారు. ముందుగా తాను విజయవాడ వెళ్లిపోయి, తర్వాత కొన్నిమంత్రిత్వ కార్యాలయాలను తరలించి,... ఇలా పరిపాలనను ఏపీ గడ్డ మీదికే తరలించేయడానికి ఆయన పడుతున్న తొందరను చూసి పలువురు పలు రకాలుగా వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు అవేమీ పట్టించుకోకుండా.. తాను చేయదలచుకున్నది చేసుకుంటూ పోయారు.
అమరావతి రాజధానిలో కోర్ కేపిటల్ ఎక్కడో.. ఎక్కడ ఏ భవనాలు వస్తాయో ఇంకా పూర్తిస్థాయిలో తేలకపోవడంతో.. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాలు నిర్మించడానికి చంద్రబాబు సంకల్పించారు. ఈ తాత్కాలిక సెక్రటేరియేట్ పనులను యుద్ధ ప్రాతిపదికన సుదీర్ఘ అనుభవం ఉన్న కంపెనీలతో పూర్తి చేయించారు. మొత్తానికి రెండు నెలలుగా శాఖలు వెలగపూడికి తరలడం అనే ప్రక్రియ నడుస్తూ ఉంది. తాజాగా హైదరాబాదులోని మొత్తం ఆఫీసులను ఖాళీ చేసేసి.. పూర్తిగా వెలగపూడికి తరలిపోయారు.
తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ కు అధికారికమైన బంధం తెగిపోయినట్లే అయింది.

