ఏం ‘మాయ’ చేశారో కదా?

బీఎస్పీ అధినేత మాయావతికి స్థానిక సంస్థల ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి. గత కొన్నేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ చతికల పడిన బీఎస్పీ తిరిగి అనూహ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంజుకుంది. మాయావతి యూపీలో పట్టుకోల్పోయారని గత కొద్దికాలంగా విశ్లేషణలు విన్పిస్తున్నాయి. మాయావతిపై అవినీతి ఆరోపణలు రావడం, అభ్యర్థుల ఎంపిక సక్రమంగా చేయకపోవడం, సీనియర్ లీడర్లు పార్టీని వీడి వెళ్లడంతో గత శాసనసభ ఎన్నికల్లో చతికలపడింది. దీంతో మాయవతి పని అయిపోయిందనుకున్నారు. రాజ్యసభకు కూడా మాయావతి రాజీనామాచేసి ప్రస్తుతం పూర్తికాలం పార్టీని పటిష్ట పర్చే కార్యక్రమంలో మునిగిపోయారు.
బీఎస్పీ తిరిగి పుంజుకుందా?
ఈ తరుణంలో యూపీలో స్థానికసంస్థలకు జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ తిరిగి పుంజుకుంది. బీజేపీ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆలీఘడ్, మీరట్ మేయర్లుగా బీఎస్పీ అభ్యర్థులే గెలిచారు. పలు చోట్ల వార్డులు, డివిజన్లను కూడా బీఎస్పీ కైవసంచేసుకుంది. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలను కాదని అక్కడి ప్రజలు బీజేపీ తర్వాత మాయావతి పార్టీవైపే మొగ్గు చూపారు. దీంతో మాయావతిలో స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు కొత్త జోష్ ను నింపాయి. 2019 లో జరిగే లోక్ సభ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని మాయావతి డిమాండ్ చేశారు. బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తే బీజేపీ అధికారంలోకి రావడం కల్ల అని మాయావతి ఈవీఎంలపై మరోసారి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. మొత్తం మీద మాయావతిలో కొత్త జోష్ కన్పిస్తోంది.
- Tags
- మాయావతి

