ఎవరిది నాటకం ...?

ఏపీ రాజకీయాలు చాలా వేడిగా మారిపోయాయి. టిడిపి, వైసిపి లు ఒకరిపై మరొకరు మీవి నాటకాలంటే మీవే నాటకాలంటూ రోడ్డెక్కేశారు. పార్లమెంట్ సాక్షిగా రెండుపార్టీలు ఒక పక్క కేంద్ర సర్కార్ పై ధ్వజం ఎత్తుతోనే మరోవైపు తమ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీ పై దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. అధికార విపక్షాలు చేస్తున్న హల్చల్ ఏ స్థాయిలో ఉందంటే బిజెపి పై వీరి యుద్ధమా ? లేక టిడిపి, వైసిపి ల నడుమ ఎన్నికల యుద్ధమా అనే స్థాయిలో ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు పరిధిని మించే నడుస్తున్నాయి.
నాటకాల ఆరోపణలకు తెరతీసిన మంత్రులు ...
వైసిపి అధినేత జగన్ తమ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తారని ఇలా ప్రకటించారో లేదో అంతే ప్రకంపనలు టిడిపి శిబిరంలో మొదలయ్యాయి. వాస్తవానికి వైసిపి పోరాటాన్ని టిడిపి స్వాగతించి తమ కార్యాచరణ కూడా ప్రకటించి ఉంటే కేంద్రం పై మరింత ఒత్తిడి పెంచి ఉండేవారు. కానీ టిడిపి మాత్రం వైసిపి టార్గెట్ రాజకీయాలకు మైలేజ్ పాలిటిక్స్ కే పెద్ద పీట వేయడం సామాజిక మాధ్యమాల్లో విమర్శలకు దారితీస్తుంది. టిడిపి మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ,గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, రామ్మోహన నాయుడు ఇలా పదిమంది వరకు విపక్ష పార్టీ ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి తరపున బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, వైవి సుబ్బారెడ్డి కౌంటర్లు ఇస్తున్నారు.
హోదా చర్చ కాకూడదు అనేనా ..?
ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రజల్లో బలంగా ఇప్పుడు సెంటిమెంట్ గా మారింది. ఈ అంశాన్ని ప్యాకేజి తో టిడిపి గత కొన్నేళ్లుగా తన సొంత మీడియా బలంతో కనుమరుగే చేసింది. అయితే ఇప్పడు ప్యాకేజి డొల్ల గా తేలడం, కేంద్రం ఇచ్చిన మొండిచెయ్యి వెరసి అంతా హోదా ఎందుకు వదులుకున్నారని అధికార టిడిపి ని ప్రతి చోటా నిలదీసే పరిస్థితి ఎదురైంది. ఈ పరిణామం నుంచి తప్పించుకోవాలంటే ఎదురుదాడి చేయడం ఈ అంశం అప్రాధాన్యత అంశంగా చేయాలనే టిడిపి వ్యూహాత్మకంగా వైసిపి ని టార్గెట్ చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. జనసేన సైతం ప్రత్యేక హోదా అంశం పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. దాంతో టిడిపి రాష్ట్ర ప్రజలముందు దోషిగా నిలబడే పరిస్థితిని మార్చాలని తన మౌత్ గన్స్ ను బయటకు తీసి వారితో ఇష్యూను డైవర్ట్ చేసే పనిలో చాలా వేగంగా పావులు కదుపుతుంది. మరో వైపు అధికారపార్టీ మీడియా సైతం వారికి వచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హోదా అంశాన్ని నీరుగార్చే పనిలోనే తలమునకలైంది. ఇప్పుడు వైసిపి, జనసేన లు టిడిపి మైండ్ గేమ్ ను ఎదుర్కోవడానికి ఎలాంటి వ్యూహం తో ముందుకు వెళతాయో చూడాలి

