ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు కంప్లయింట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న మాటలు ఎమ్మెల్యేల చెవికెక్కడం లేదు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి విభాగాన్ని పటిష్టపర్చాలని నిర్ణయించారు. ఇటీవల కేసీఆర్ టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘమైన టీఆర్ఎస్వీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కూడా అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిని తర్వాత విద్యార్థుల్లో నియామకాలు పెద్దగా లేవన్న అసంతృప్తి ఉంది. అయితే లక్షలకు లక్షలు ఉద్యోగాలు సృష్టించలేమని కేసీఆర్ ఎప్పటి నుంచో చెబున్నారు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. చివరకు శతవసంతాల పండుగలో కూడా అక్కడి పరిస్థితిని బట్టి కేసీఆర్ ప్రసంగిచంలేకపోయిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ విద్యార్థి సంఘాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వాలను పెంచాలని నిర్ణయించారు కేసీఆర్. ఆ సమావేశంలో మీకు నియోజకవర్గాల్లో ఇబ్బందులు ఎదురైతే ఎమ్మెల్యేలు సహకరిస్తారని కూడా చెప్పారు. విద్యార్థి సంఘ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్ క్లారిటీతో చెప్పారు. విద్యార్థి సంఘం బలంగా ఉంటే ఎమ్మెల్యేలకే లాభమని హితబోధ కూడా చేశారు.
విద్యార్థి సంఘాల నేతల ఫిర్యాదుపై సీరియస్.....
అయితే సమావేశంలో తలూపిన ఎమ్మెల్యేలు ఎక్కువ మంది విద్యార్థి సంఘాల నేతలు అక్కడకు వెళ్లినప్పుడు హ్యాండ్ ఇచ్చారట. విద్యార్థి సంఘాలతో తమకు సంబంధం ఏంటని కొందరు నిలదీశారట. అలాగే మరికొందరు తమ అనుచరులను విద్యార్థి సంఘాల నేతలుగా నియమిస్తే తాము సహకరిస్తామని చెబుతున్నారు. మరికొందరు తమకంత సమయం లేదని మొహాన్నే చెప్పేశారట. దీంతో విద్యార్థి సంఘ నేతలు కేసీఆర్ వద్దకు వచ్చి తమ మొర పెట్టుకున్నారు. దీంతో కేసీఆర్ వారికి సహకరించని ఎమ్మెల్యేల పేర్లు అడిగి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు ఈ బాధ్యతను మంత్రి కేటీఆర్ కు అప్పగించారని చెబుతున్నారు. అందరు ఎమ్మెల్యేలు విధిగా విద్యార్థి సంఘ నేతలకు సహకరించాల్సిందేనని, లేకుంటే తాను ఫోన్ చేయాల్సి వస్తుందని సంకేతాలు పంపారట. మొత్తం మీద కేసీఆర్ ను కలిసి ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన పార్టీలోని తొలి అనుబంధ సంఘం విద్యార్థి సంఘమే. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కేసీఆర్ కూడా వారి విషయంలో సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
- Tags
- కేసీఆర్

