ఎంపీకి ఎస్పీ సవాల్.. నన్ను బదిలీ చెయ్!

ఆదిలాబాద్ ఎంపీ నగేష్ ఇంట్లో జరిగిన చోరీ విషయంలో పోలీసులపై విమర్శలు రావడంపై జిల్లా ఎస్పీ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్షంగా ఎంపీ పేరును ప్రస్తావించకుండానే విమర్శలు చేసిన ఎంపీ నగేష్‌కి సవాల్ విసిరారు. దొంగతనం జరగడంలో పోలీసుల వైఫల్యం ఉన్నట్లు నిరూపిస్తే.. తనును బదిలీ చేయించొచ్చు అని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీ నగేష్ ఇంట్లో గత నెల చివర్లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలో దొంగతనం జరిగిన వెంటనే పోలీసులు స్పందించలేదని, పోలీసులు వైఫల్యం వల్లే దొంగతనం జరిగిందని ఎంపీ అన్నారు. ‘సాక్షాత్తూ ఎంపీ ఇంట్లో దొంగతనం జరిగినా జిల్లా ఎస్పీ స్పందించలేదు. కనీసం ఒక్కసారైనా తనకు ఫోన్ చేయలేదు. పోలీసుల వైఖరి సరిగా లేదు. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగింది’ అని ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎస్పీ లేకపోవడం వల్లనే........
అయితే ఆ సమయంలో ఎస్పీ అందుబాటులో లేనందునే గ్యాప్ వచ్చిందని ఇతర పోలీసు అధికారులు చెబుతున్నారు. దొంగతనం జరిగిన నాటి నుంచి ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు బృందాలు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి 12 తులాల 5 గ్రాముల బంగారాన్ని, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సోమవారం మీడియా ముందు ప్రవేశపెట్టిన ఎస్పీ.. పోలీసుల వైఫల్యం వల్లే తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఎంపీ నగేష్ చేసిన విమర్శలపై స్పందించారు. ఎంపీ పేరును ప్రస్తావించకుండానే.. ‘ఓ కేసు విచారిస్తున్నప్పుడు వీలైతే ప్రోత్సహించాలి.. కానీ పోలీసుల వైఫల్యం అనడం సరికాదు. పోలీసుల వైఫల్యం ఎక్కడుందో చూపించండి..? నేను ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోతాను’ అని సవాల్ విసిరారు. ‘మీరు కూడా నన్ను బదిలీ చేయించొచ్చు. నేనేం అనుకోను’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల పోలీసుల మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు.
- Tags
- ఎస్పీ సవాల్

