ఉప్పు నిప్పులు కలిసింది నిజమేనా ..?

టిపిసిసి చీఫ్ ఉత్తమకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకటరెడ్డి విభేదాలు పక్కన పెట్టేశారా ..? వీరిద్దరూ ఇప్పుడు పాడుతున్న యుగళ గీతం నిజమేనా ...? అవును నిజమే అంటున్నారు వారిద్దరూ. ఉప్పు నిప్పుగా టి కాంగ్రెస్ లో వున్న ఇరువురి నేతలు ఢిల్లీ లో రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి వెళ్లిన సందర్భంలో రాహుల్ ను ప్రధాని చేయడమే తమ టార్గెట్ అని స్పష్టం చేశారు. ఇక ఉత్తమకుమార్ రెడ్డి ఒకడుగు ముందుకు వేసి తమ మధ్య విభేదాలు అనేవి మీడియా సృష్టి అని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ వ్యాఖ్యలతో కోమటి రెడ్డి ఏకీభవించారు. కేసీఆర్ సర్కార్ దుర్మార్గ పాలన అంతరించి పోవడమే తమ లక్ష్యం అన్నారు.
తెలంగాణ గ్రూప్ లపై సీరియస్ అయిన అధిష్టానం ...?
తెలంగాణ ఇచ్చి తెచ్చినా అధికారం కోల్పోవడానికి కాగ్రెస్ నేతల నడుమ పవర్ పాలిటిక్స్ కారణం అని అధిష్టానం పోస్ట్ మార్టం లో తేలింది. దాంతో టి కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియా నేతలందరికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారని సమాచారం. చిన్న చిన్న విభేదాలను రోడ్డుపై పెట్టి పార్టీ పరువు తీయకండని సంఘటితం అయితేనే కేసీఆర్ హావాను బ్రేక్ లు వేయగలమని హితబోధ చేశారు ఆయన. పార్టీకి ప్రజల్లో ఆదరణ చూసి అనేకమంది వస్తున్న తరుణంలో గ్రూప్ లు ఏమిటని నిలదీశారు. . ఈ నేపథ్యంలో ఎడ మొహం పెడ మొహం గా వీరిద్దరూ నేతలు దారిలోకి వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.

