ఈ వైసీపీ ఎంపీ టీడీపీలో చేరి బావుకుందేమిటి....?

వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి చేరిన నందిపైపుల యజమాని, నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి పార్టీలో ఇబ్బంది పడుతున్నారా? తనకు ఏమాత్రం విలువ లేదని ఆయన మధనపడిపోతున్నారా? అవుననే అంటున్నారు ఆయన అనుచరులు. టీడీపీకి ఎంత చేసినా తమకు మాత్రం ఆ పార్టీ ఒరగబెట్టిందేమీ లేదని ఎంపీ ఎస్పీవై రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పోటీ చేసి గెలుపొందారు ఎస్పీవై రెడ్డి. కర్నూలు జిల్లాలో రెండు ఎంపీ స్థానాలనూ వైసీపీయే గెలుచుకుంది.
అధికార పార్టీ అని సైకలెక్కితే...
అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం గెలిచిన ఏడాది తర్వాత ఎస్పీవై రెడ్డి సైకలెక్కేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో టీడీపీ పవర్ లో ఉండటంతో ఎస్పీవై రెడ్డి టీడీపీలోకి చేరేందుకు ఎంతమాత్రం ఆలస్యం చేయలేదు. పైగా పార్టీని వదిలివెళ్లేటప్పుడు వైసీపీ అధ్యక్షుడు జగన్ పై బురద జల్లి వెళ్లిపోయారు. కనీసం జగన్ తనను కూర్చోమని కూడా అనడని, పెద్దవాడినన్న గౌరవం కూడా ఇవ్వరని ఎస్పీవై రెడ్డి విమర్శలు చేసి వైసీపీకి రాంరాం చెప్పి వెళ్లిపోయారు.
నంద్యాల ఉప ఎన్నికలో వీల్ ఛైర్ లో...
భూమా నాగిరెడ్డి మరణంతో కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నంద్యాల పార్లమెంటు పరిధిలో తాను చక్రం తిప్పవచ్చని ఎస్పీవై రెడ్డి భావించారు. తాను చెప్పినట్లే జరుగుతుందని ఆశించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి టిక్కెట్ కోసం ఎస్పీవై రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అయినా దక్కలేదు. అయితే చంద్రబాబు ఆయనకు నచ్చజెప్పి భవిష్యత్తులో పదవి ఇస్తానని చెప్పి పంపారు. దీంతో ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో ఉన్నప్పటికీ వీల్ ఛైర్ లో నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి విజయానికి తీవ్రంగా కృషి చేశారు. ఆర్థికంగా కూడా కొంత అభ్యర్థికి సహకరించారు.
అల్లుడికి పదవి దక్కలేదని...
అయితే తాజాగా కర్నూలు జిల్లా స్థానికసంస్థల ఎమ్మెల్సీ స్థానానికి తన అల్లుడు శ్రీధర్ రెడ్డికి ఇవ్వాలని గట్టిగానే ఎంపీ ఎస్సీవై రెడ్డి ప్రయత్నించారు. గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. కుటుంబంలో ఎంపీపై వత్తిడి పెరుగుతోంది. ఇంత చేసినా పార్టీ అధిష్టానం గుర్తింపు ఇవ్వకపోవడాన్ని ఎంపీ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. నంద్యాల ఉప ఎన్నికను కూడా చంద్రబాబు గుర్తుంచుకోలేదని ఆయన వాపోతున్నారట. మొత్తం మీద వైసీపీ నుంచి గెలిచి అధికార టీడీపీలోకి వచ్చినా తాము బావుకుందేమీ లేదన్నది ఎంపీ ఎస్పీవై రెడ్డి అనుచరుల ఆందోళన. ఇదండీ సంగతి పార్టీ మారినా... ప్రయోజనం లేకపోయె.

