ఈ వైసీపీ ఎంపీలపై వేటు పడుతుందా?

రాజ్యసభలో ఇద్దరు జేడీయూ ఎంపీలపై అనర్హత వేటు వేశారు. కాని లోక్ సభలో ఇప్పటికి ముగ్గురు ఎంపీలు పార్టీ మారి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై వైసీపీ ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఇటీవల రాజ్యసభలో జేడీయూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ శరద్ యాదవ్ తో పాటు ఆలీ అన్వర్ ల రాజ్యసభ సభ్యత్వాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ముగ్గురు ఎంపీలు పార్టీ మారారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుకలు పార్టీ మారారు. వీరు బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
గీతపై గతంలోనే ఫిర్యాదు....
కాని గతంలో అరకు ఎంపీపై వైసీపీ నేతలు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. కాని ప్రివిలేజ్ కమిటీ దీనిపై ఇంతవరకూ చర్యలు తీసుకోలేదు. ముఖ్యంగా కొత్త పల్లి గీతపై ప్రివిలేజ్ కమిటీకి కూడా వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. లేఖ కూడా రాశారు. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయకపోవడాన్ని వైసీపీ నేతలు తప్పుపుడుతున్నారు. అయితే కొత్త పల్లి గీతతో పాటు ఎస్పీవైరెడ్డి, బుట్టా రేణుక మీద కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ మేరకు స్పీకర్ కు ఈరోజు లేఖ రాయనున్నారు.
తాజాగా మరో ఇద్దరిపై....
కొత్త పల్లిగీత టీడీపీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. కాని బుట్టారేణుక మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బహిరంగంగానే ఆమె టీడీపీ సమావేశాలకు హాజరవుతున్నారు. ఇక ఎస్పీవై రెడ్డి కూడా అంతే. ఆయనైతే ఏకంగా టీడీపీ కండువా కప్పుకుని తిరుగుతున్నారు. దీంతో వీరిపై మరోసారి ఫిర్యాదు చేయాలని వైసీపీ నిర్ణయించింది. రాజ్యసభ మాదిరిగానే ఇక్కడ కూడా వీరిపై వేటు వేయాలన్నది వైసీపీ డిమాండ్.
- Tags
- వైసీపీ ఎంపీలు

