ఈ మంత్రి గారి పదికోట్లు హుష్....కోడి....!

సంక్రాంతి పండుగ ముగిసింది. పండగకు ఎప్పుడు మామూలుగానే కోళ్లకు కత్తులు కట్టారు. కోట్లలో పందేలు కాశారు. ఈ మూడు రోజుల్లో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఎప్పటిలాగే గోదావరి జిల్లాలు ఉత్సాహంగా బరిలోకి దిగాయి. మొత్తం గోదావరి జిల్లాల్లోనూ రూ.1000 కోట్ల వరకు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఇక గతానికి భిన్నంగా ఈ సారి కృష్ణా జిల్లాలోనూ అంచనాలకు మించి పందేలు జరిగాయి. కోడి పందాల ముందు కోర్టుల ఆంక్షలు ఏ మాత్రం నిలవలేదు. ఇక పోలీసులు కూడా మామూళ్ల మత్తులో చోద్యం చూడడంతో పందేలకు బ్రేక్ వేసే నాథుడే లేకుండా పోయాడు.
అదో సరదా....
ఇక ఎప్పటి మామూలుగానే ఈ పందేల్లో సామాన్యులతో పాటు బడా బడా పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు కూడా జోరుగా, హుషారుగా పాల్గొన్నారు. పందేల్లో కొందరు లక్షలు ఆర్జిస్తే, మరి కొందరికి మాత్రం జుబులు ఖాళీ అయ్యి వారు గుల్లయ్యారు. ఇక ఈ పందేల్లో ఓ మంత్రి గారు ఏకంగా రూ.10 కోట్ల వరకు పోగొట్టుకున్నట్టు సమాచారం. సదరు మంత్రికి ఏటా కోడి పందాల్లో కోట్లాది రూపాయలు బెట్టింగ్ వేయడం మామూలే. ఆయనకు అదో సరదా...ఇక్కడ వచ్చినా పోయినా ఆయన మాత్రం ఈ మూడు రోజుల్లో కోట్లలోనే బెట్టింగ్ వేస్తుంటారు. తెలంగాణ మంత్రి ప్రతి ఏడాది పశ్చిమ గోదావరి జిల్లాకు కోడిపందేలకు వస్తుంటారు.
పదిహేను కోట్లు పెడితే....
ఇక ఏపీలోని పశ్చిమగోదారి జిల్లా వెంప గ్రామంలో జరిగిన పందాల్లో ఆ మంత్రి రూ.15 కోట్ల వరకు బెట్టింగ్ కాస్తే అందులో రూ.10 కోట్లు పోయినట్టు తెలుస్తోంది. అయితే ఓ ఏపీ మంత్రి ఈ రేంజ్లో బెట్టింగ్‌లు కాస్తే చంద్రబాబుకు తెలియకుండా ఉండదు. ఆ మంత్రికి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు కూడా తప్పవు. అయితే ఈ రేంజ్లో బెట్టింగ్ కాసింది ఏపీ మంత్రి కాదు... తెలంగాణ మంత్రి కావడం గమనార్హం. ఆ మంత్రి గతంలో టీడీపీ మనిషే... ఆయనకు గోదావరి జిల్లాల్లో బంధుత్వాలు కూడా బలంగానే ఉన్నాయి. దీంతో ప్రతి యేటా ఇక్కడకు వచ్చి పండగ మూడు రోజులు బెట్టింగ్‌లు కాస్తుంటారు.
గతంలో టీడీపీ మంత్రిగా కూడా....
తెలుగుదేశం వాళ్లతో ఆయన చెక్కు చెదరని అనుబంధం ఉంది. ఆయన గతంలో టీడీపీ మంత్రిగాను పనిచేశారు. ఇప్పుడు పార్టీ మారి మరోసారి మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి ఆయన ముందుగానే పోటీలకు వచ్చి భారీగా సొమ్ములను పందెంలో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తం మూడు రోజుల పందాల్లో ఆయనకు రూ.10 కోట్లు పోయినా ఆయన మాత్రం చాలా లైట్ తీస్కొంటున్నారట. పందెం అన్నాక ఓ సారి వస్తాయి... మరోసారి పోతాయని అంటున్నారట. ఇక ఈ మూడు రోజుల పందాలకు ఆయనతో పాటు ఆయన అనుచరగణం కూడా భారీగా ఇక్కడకు తరలి వచ్చిందట.

