ఈ పార్టీలో సీనియర్స్ వర్సెస్ జూనియర్స్

వచ్చే ఎన్నికల నాటికి అందరూ కలిసికట్టుగా తెలంగాణలో కాంగ్రెస్ను గెలుపు తీరాలకు చేర్చాలని అధిష్టానం ఆలోచిస్తుంటే.. సీనియర్లు, జూనియర్లు చెరోదారిలో వెళుతున్నారు. కొత్త తరానికీ, పాత తరానికీ మధ్య అంతరాలు ఉండటంలో సహజమే! వాళ్ల ఆలోచనలకీ.. వీళ్ల ఆలోచనలకీ.. సాపత్యమే ఉండదు! జూనియర్లేం చేసినా తప్పు అని సీనియర్లు.. అబ్బే ఇప్పుడు కావాల్సింది సీనియర్లకు తెలియదని జూనియర్లు.. భావిస్తుండటం సహజమే! జాతీయ స్థాయిలో ఎలా ఉన్నా.. తెలంగాణలో మాత్రం ఈ కొత్త, పాత తరాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా వ్యవహారాలు నడుస్తున్నాయట. కొందరు నేతల పట్ల సీనియర్లు వ్యవహరిస్తున్న తీరుతో జూనియర్లు విసిగి వేశారిపోతున్నారట. వీరి వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభమేమీ ఉండదని అసంతృప్తితో ఉన్నారట.
బహిరంగంగానే...
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్, జూనియర్ నేతల మధ్య కొన్ని రకాల అభిప్రాయాభేదాలు వస్తున్నాయి. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్పై పోరాడాల్సిన నేతలు.. ఇప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. పార్టీకి సంబంధించి ఏదైనా కీలక సమావేశం ఉంటే.. దానికి హాజరైన సీనియర్లు సీరియస్ గా వ్యవహరించడం లేదని, అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశాలపట్ల కూడా నిబద్ధత ప్రదర్శించడం లేదనేది కొందరు నేతలు విమర్శలు వినిపిస్తున్నాయి. సీనియర్ల తీరుపై మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి లాంటివాళ్లయితే బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు.
కష్టకాలంలో ఉన్నప్పటికీ...
పార్టీ కష్టం కాలంలో ఉందని వారికి తెలిసినా, సమష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం కనిపిస్తున్నా సీనియర్ల తీరులో మార్పు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు! కొంతమంది సీనియర్ నేతల వల్ల పార్టీలోకి కొత్తగా వస్తున్న వారిలో ఉత్సాహం నీరుగారిపోయేలా ఉందనేది వీరి ఆవేదన. సీనియర్లు, జూనియర్ల మధ్య ఈ చర్చ మొదలవడానికి మూలం రెండు ఘటనలు. వాటిలో మొదటిది.. సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు వెళ్లిన వీహెచ్ లాంటి సీనియర్లు అక్కడి పార్టీ శ్రేణులపై మండిపడిన తీరు వార్తల్లోకెక్కింది. అందరినీ కలుపుకొని కదలాల్సిన వాళ్లు ఇలా వ్యవహరించడం సరికాదనేది కొందరి వాదన.
రేవంత్ రెడ్డి రాకతో...
ఇక, రెండోది.. రేవంత్ రెడ్డి రాక! ఆయన గాంధీ భవన్ లోకి అడుగుపెడుతున్న రోజునే కొందరు సీనియర్లు జోకులు వేసుకున్నారట! జానా రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ లో ఉన్నది ఒక్క బాహుబలి మాత్రమే కాదనీ, చాలామంది ఉన్నారంటూ సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. దీనిపైనా జూనియర్లు ఆగ్రహంతో ఉన్నారట! ఇతర పార్టీల నుంచి నేతలు వస్తుంటే వారికి సహకరించాల్సింది పోయి, ఇలా వ్యంగ్యంగా మాట్లాడితే ఎలా అంటున్నారు. తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడమే ఈ పరిస్థితి కారణమనే ఆవేదనతో కొంతమంది నేతలు ఉన్నారట. మొత్తానికి తమ వైఖరి మార్చుకుని జూనియర్లకు సీనియర్లు సాయం అందజేస్తేనే మంచి ఫలితాలు వస్తాయనేది విశ్లేషకుల అభిప్రాయం!!
- Tags
- కాంగ్రెస్

